Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివరాలు వెల్లడించిన సీపీ డాక్టర్ తరుణ్ జోషి
నవతెలంగాణ మట్టెవాడ
రెండేండ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన ముఠాను అరెస్టు చేసి, బాలుడిని క్షేమంగా కన్నతల్లికి అప్పగించినట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి తెలిపారు. ఈ నెల 11న అపహరణకు గురైన బాలుని తల్లి ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు రంగంలోకి దిగి సీసీ కెమెరాల ఆధారంగా ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి వారు ఉపయోగించిన ఆటో, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీపీ తరుణ్ జోషి ఘటన వివరాలను వెల్లడించారు.
ముద్గంగుల జానకి అలియాస్ ఝాన్సీ, గుంపి రాజు, గుంపి మహేష్, పల్లెపు కష్ణ, కోనా రెడ్డి ఎల్లమ్మ అలియాస్ భాగ్యమ్మ, కూతటి జంగయ్యలు పథకం ప్రకారం బాలుడి కిడ్నాప్‌కు ప్రణాళికలు రచించారు. నిందితులల్లోని జానకీ, రాజులు కొన్నేండ్ల నుంచి హైదరాబాదులో ఒక ఇంటిలో సహజీవనం చేస్తున్నారు. వారికి ఎల్లమ్మ అలియాస్ భాగ్యమ్మ పనులు చేయడంతో పాటు పెంచుకోవడానికి ఒక బాబు కావాలని, బాబును తీసుకొస్తే లక్ష రూపాయలు ఇస్తానని చెప్పారు. దీంతో డబ్బుకు ఆశపడిన జానకీ, రాజులు ఎక్కడినుండైనా బాబుని అపహరించి అప్పజెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా జానకి తమ్ముడు పల్లెపు కష్ణ, రాజు తమ్ముడు గంప్పి మహేష్‌లతో కలసి వారి ప్రణాళికలో భాగంగా ముగ్గురు నిందితులు ఒకే ఆటోలో ఈ నెల 10వ తేదీన వరంగల్ నగరానికి వచ్చారు. ఈ క్రమంలో మరుసిటి రోజు 11వ తేదీ తెల్లవారుజామున జెమినీ టాకీస్ ప్రాంతంలో రోడ్డుపై తల్లి పక్కన నిద్రిస్తున్న రెండేండ్ల బాలుడు డానియల్‌ను అపహరించి హైదరాబాద్‌కు వెళ్లారు. ప్రధాన నిందితురాలైన జానకి బాలుడిని ఒప్పందం ప్రకారం హిమ్మత్‌నగర్‌లోని ఎల్లమ్మకు అందజేసింది. బాలుడిని తీసుకున్న ఎల్లమ్మ తన మరిది జగ్గయ్యకు అందజేసింది..
బాబు తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో అప్రమత్తమైన మట్వాడ పోలీసులు సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి పర్యవేక్షణలో, వరంగల్ ఏసీపీ గిరి కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బందాలు ఏర్పాటు చేసి సంఘటన జరిగిన ప్రదేశంలో, ఇతర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఆధారంగా చేసుకొని నిందితులను గుర్తించారు. హైదరాబాదులో బేగంపేటలో ఉన్న నలుగురు నిందితులను పట్టుకొని వారు ఇచ్చిన సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మిర్ పేట లో నివాసం ఉంటున్న జగ్గయ్య ను అరెస్టు చేసి అతని దగ్గర ఉన్న బాలుడిని క్షేమంగా తీసుకొచ్చారు. బాలుడిని క్షేమంగా తీసుకురావడానికి కృషి చేసిన వరంగల్ ఏసీపీ గిరి కుమార్, మట్టెవాడ సీఐ గణేష్, ఎస్ఐ అశోక్, అసిస్టెంట్ అనలిటికల్ ఆఫీసర్ సల్మాన్ పాషా, కానిస్టేబుల్ విజరు, రాజేందర్, దీపక్‌లను కమిషనర్ అభినందించి రివార్డు అందజేశారు.