Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎత్తులు.. పైఎత్తులు..
- సోషల్ మీడియాలో హల్చల్
- ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
హుజురాబాద్ ఉప ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం ఉదయం 7.00 గంటల నుంచి రాత్రి 7.00 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. నియోజకవర్గంలోని 5 మండలాల్లో 2 లక్షల 37 వేల 36 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళలు లక్షా 19 వేల 102 మంది, లక్షా 17 వేల 993 మంది పురుషులున్నారు. బరిలో 30 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీల మధ్యే నెలకొంది. ఈ రెండు పార్టీల మధ్య నువ్వా ..? నేనా..? అన్నంతగా భీకరపోరు జరుగుతోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఓటుకు రూ.6,000లను అధికార టీఆర్ఎస్ పార్టీ పంపిణీ చేసినట్లు ఓటర్లే బహిర్గతం చేసినా ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. బీజేపీ సైతం పలు ప్రాంతాల్లో ఓటుకు రూ.1,500లను పంపిణీ చేసింది. ఇంత బహిరంగంగా నగదు పంపిణీ జరిగినా ఎన్నికల సంఘం, పోలీసు అధికారులు చేతులెత్తేశారు. ఏకంగా ఓటర్లు కొంత మందికే డబ్బులిచ్చారు.. తమకివ్వలేదని, తమకు కూడా డబ్బులివ్వాలని నేతలను నిలదీయడమే కాకుండా రోడ్డెక్కి ఆందోళనలకు దిగడం గమనార్హం. టీఆర్ఎస్, బీజేపీలు సోషల్ మీడియాలో పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ రచ్చ చేస్తున్నాయి. జమ్మికుంట, కమలాపూర్‌లో ఎన్నికల ఇన్ఛార్జిలుగా వ్యవహరించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ ప్రచారం టీఆర్ఎస్కు ప్రతికూలంగా మారే అవకాశముండొచ్చని భావిస్తున్నారు. ఇదిలావుంటే వరి వేయొద్దని సీఎం కేసీఆర్ ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తుంది. ఏదేమైనా హుజురాబాద్ ఉప ఎన్నికలు కాకా పుట్టిస్తున్నాయి.
హుజురాబాద్ ఉప ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. శనివారం ఉదయం 7.00 గంటల నుండి రాత్రి 7.00 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. గత నాలుగు నెలలుగా జరిగిన ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు యుద్ధాన్ని తలపించాయి. ఎట్టకేలకు ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకోవడంతో ప్రశాంతంగా వుంది. ఇదిలావుంటే గత మూడ్రోజులుగా నియోజకవర్గంలో ఓటుకు అధికార టీఆర్ఎస్ పార్టీ రూ.6,000, బీజేపీ రూ.1,500 పంపిణీ చేయడం మరో రాజకీయానికి వేదికైంది. టీఆర్ఎస్ నేతలు అందరికీ నగదు ఇవ్వకుండా కొంత మందికే ఇచ్చారని ఓటర్లు పలు గ్రామాల్లో రోడ్డెక్కారు. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడమే కాకుండా స్థానిక టీఆర్ఎస్ నేతలను నిలదీశారు. దీంతో నేతలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కమలాపూర్, హుజురాబాద్, జమ్మికుంట మండలాల్లో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ నగదు పంపిణీ ప్రతికూలంగా మారుతుందేమోనని అధికార టీఆర్ఎస్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వరి కుంపటి..
సీఎం కేసీఆర్ వరి వేస్తే ఉరి వేసుకున్నట్టేనని వ్యాఖ్యానించడం ఈ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది వరి సన్నాలు పండించాలని చెప్పిన సీఎం కేసీఆర్, ఇప్పుడు వరి పండించొద్దని చెప్పడం బీజేపీకి మంచి అస్త్రాన్ని అందించినట్టయ్యింది. దీంతో బీజేపీ ఈ విషయాన్ని రాజకీయంగా వినియోగించుకుంది. దీంతో ఈ నియోజకవర్గ ప్రచార బాధ్యతలను చూస్తున్న మంత్రి హరీశ్‌రావు నష్టనివారణ చర్యలు చేపట్టారు. వరి వేసుకోవద్దని ఎవరూ చెప్పలేదని, బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ధాన్యం కొనుగోలు చేయమని చెప్పలేదని, ఇప్పటికే హుజు రాబాద్ నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలు పెట్టి వానాకాలం ధాన్యం కొంటున్నామని చెప్పారు. వాస్తవానికి ఉప ఎన్నికల నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలో మాత్రమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయడం గమనార్హం. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో నష్టనివారణకు మళ్లీ మంత్రులు, ఎమ్మెల్యేలు వరి పండించొద్దనలేదని, ధాన్యం కొంటామని ప్రెస్మీట్లు పెట్టి మరీ ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. దీంతో మరోమారు ఈ రెండు పార్టీల నడుమ మాటల యుద్ధం సాగింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు
హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో గత నాలుగు నెలలుగా వివిధ మండలాల్లో ఇన్ఛార్జిలుగా వ్యవహరించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ నేతల సతీమణుల పట్ల ప్రవర్తించిన తీరు, అక్రమ సంబంధాలు పెట్టుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అధికార టీిఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లాకు చెందిన మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమలాపూర్, జమ్మికుంట మండలాల్లో వారి కార్యక్రమాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆశ్రయమిచ్చిన టీిఆర్‌ఎస్ నేతల కుటుంబాల్లోనే చిచ్చు పెట్టిన వైనంపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ వ్యవహారంపై గత వారం రోజుల క్రితమే ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరాతీసి నివేదికలను ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం.