Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంకరి వీరయ్య
నవతెలంగాణ-మహబూబాబాద్
దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంకరి వీరయ్య విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పెరుమాండ్ల జగన్నాధం భవన్లో 'ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీ కరణ-మానిటేషన్ విధానాలు-కార్మికులపై ప్రభావం' అంశంపై శుక్రవారం నిర్వహించిన సెమినార్లో వీరయ్య మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం దేశంలో ఆర్థిక సంక్షోభం పెరిగిందని తెలిపారు. 2019లోనే ప్రధాని కార్యాలయ ముఖ్య సలహాదారు దేశ ఆర్థిక రంగం ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో ఉందని స్పష్టం చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ దిశగా అడుగులు వేయడం భవిష్యత్ తరాలకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తోందని చెప్పారు. లక్ష కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన ఎల్ఐసీని కేవలం వంద కోట్ల రూపాయలకు అమ్మకానికి పెట్టడం దుర్మార్గమన్నారు. దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థల కన్నా ఎల్ఐసీ పూర్తిగా లాభాల బాటలో ఉందని చెప్పారు. ఎల్ఐసీ ద్వారా ప్రజలకు 90 శాతం లాభం కలుగు తుండగా దాన్ని ప్రయివేటుపరం చేయడం కుట్ర పూరితమన్నారు. జింక్ పరిశ్రమను ప్రయివేట్ సంస్థకు విక్రయించడం వల్ల అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగి అపార్ట్మెంట్లు వెలిశాయని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారుల కుట్ర దాగి ఉందని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు రెండు లక్షల కోట్ల ఆస్తులున్నా దాన్ని కేవలం ఐదు వేల కోట్ల రూపాయలకు విక్రయించడానికి పూనుకోవడం అత్యంత దారుణ మన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు సమయంలో రైతుల నుంచి భూములు సేకరిస్తూ సంస్థలను ప్రయివేటుపరం చేస్తున్నప్పుడు భూములను రియల్టర్లకు కట్టబెట్టడం సరికాద న్నారు. ఉక్కు పరిశ్రమ కొనుగోలుకు ఎవరూ ముందుకు రాక పోవడంతో దేశంలోని రోడ్లు, జాతీయ రహదారులు, బొగ్గు నిక్షేపాలు, బీఎస్ఎన్ఎల్, విద్యుత్, తదితర సంస్థలను 40-50 ఏండ్లపాటు లీజ్‌కు ఇవ్వడానికి వ్యూహరచన జరుగుతోందని ఆందోళన వెలిబుచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవన స్థితి గతులు పెట్టుబడిదారులు బహుళజాతి సంస్థల దయాదాక్షిణ్యాల పై ఆధారపడే పరిస్థితి రాబోతోందని చెప్పారు. ప్రయివేటీకరణను అన్ని తరగతుల ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆకుల రాజు, పట్టణ కార్యదర్శి కుమ్మరికుంట్ల నాగన్న, తదితరులు పాల్గొన్నారు.