Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేదెలా..? అంటూ వంట ఏజెన్సీ మహిళలు ఆందోళనకు గురౌతున్నారు. ఆ భారాన్ని మోయలేక కొన్ని చోట్ల భోజనం తయారీకి దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని చోట్ల బతుకుదెరువు కోసం మధ్యాహ్న భోజన నిర్వహణను కొనసాగిస్తూ చేసిన అప్పులు చెల్లించలేక మానసిక వేదనకు గురౌతున్న దుస్థితి ఉంది. దీనికి తోడు అనేక పాఠశాలల్లో వంట గదులు లేకపోవడంతో ఏజెన్సీ మహిళలు ఆరుబయటే మధ్యాహ్న భోజనం తయారు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన కాలానికి కనీసం నెలకు వెయ్యి రూపాయల పారితోషికం అయినా చెల్లించి ఆదుకోవాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
నిత్యావసర సరుకుల ధరలు ఇలా..
పాఠశాల చదువుకుంటున్న విద్యార్థులకు భోజనంలో కోడిగుడ్డును విధిగా అందించాల్సి ఉంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కోడి గుడ్డు ధర రూ.5లు ఉండగా ప్రభుత్వం వంట ఏజెన్సీలకు కేవలం రూ.4లు చొప్పున మాత్రమే చెల్లిస్తోంది. అలాగే ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు ధర కిలోకు రూ.105లు, లీటర్ నూనెకు రూ.155లు, వంట చెరుకు క్వింటాకు రూ.500లు, టమాటా కిలో రూ.20లు, ఉల్లిగడ్డ రూ.30లు, కిలో పచ్చిమిర్చి రూ.80లు పలుకుతున్నాయి. ప్రస్తుతం ఇచ్చే అరకొర డబ్బులతో వీటిని కొని భోజనాన్ని అందిస్తూ అధిక భారం మోయాల్సి వస్తోందని మధ్యాహ్న భోజన నిర్వాహకులు వాపోతున్నారు. ఒక్కో విద్యార్థికి ప్రస్తుతం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రూ.4.97లు చొప్పున (గుడ్డుకు అదనంగా రూ.4లు), ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు రూ.7.45లు చొప్పున (గుడ్డుకు అదనంగా రూ.4లు), 9 10వ తరగతుల విద్యార్థులకు గుడ్డుతో రూ.9.45లు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. మండలంలో 49 పాఠశాలలకు 49 మహిళా ఏజెన్సీ గ్రూపులున్నాయి. నెలకు సుమారుగా ఎనిమిది నుంచి రూ.10 లక్షలు ప్రభుత్వం మహిళా గ్రూపు ఏజెన్సీలకు చెల్లించాల్సి ఉంది.
నిర్వహణ భారంగా ఉంది
గొల్లు పద్మ, సాయిబాబా మహిళ గ్రూపు లీడర్
నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా మధ్యాహ్న భోజనం కోసం చెల్లించే డబ్బులు పెరగలేదు. కరోనా వల్ల 18 నెలలు పాఠశాలలు మూతపడ్డాయి. ఆ సమయంలో పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. కుటుంబ పోషణ కోసం అప్పుల పాలయ్యాం. ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ కాలానికి నెలకు వెయ్యి రూపాయలు చొప్పున పారితోషికం అందచేయాలి. ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడానికి అప్పు చేయాల్సి వస్తోంది.
వంట ఏజెన్సీలపై ఆర్థిక భారం వేయొద్దు : పి సరిత, సాయిబాబా మహిళా గ్రూపు లీడర్
పాఠశాలల వంట ఏజెన్సీలపై ప్రభుత్వం ఆర్థిక భారం వేయొద్దు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజనం బిల్లులను పెంచి చెల్లించాలి. భారాన్ని ప్రభుత్వమే భరించాలి. పాఠశాలలో వంట చేసే సమయంలో కనీస మౌలిక వసతులు కల్పించాలి. వంట గదులు నిర్మించాలి.