Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య కనుమరుగేనా..? అని విద్యార్థుల్లో, తల్లి దండ్రుల్లో ఆందోళన నెలకొంటోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సాధారణ విద్యతోపాటు సాంకేతిక విద్య అందించేల ప్రభుత్వం 2009-10 విద్యాసంవత్సరంలో పాఠశాలలకు కంప్యూటర్లను మంజూరు చేసింది. నాటి నుంచి 2014-15 విద్యా సంవత్సరం వరకు ఆయా పాఠశాలల్లో కంప్యూటర్ విద్య కొనసాగింది. కంప్యూటర్ విద్యాబోధన కోసం ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన బోధకులను నియమించింది. కాగా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇన్స్ట్రక్టర్లను తొలగించడంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందని ద్రాక్షగానే మిగిలింది. పాఠశాలల్లో కంప్యూటర్ల ద్వారా విద్యార్థులకు విద్య అందించేందుకు ప్రత్యేకంగా కంప్యూటర్ ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేశారు. ఒక్కో ఉన్నత పాఠశాలకు 11 కంప్యూటర్లను, ప్రొజెక్టర్, ఇన్వర్టర్లను కూడా ప్రభుత్వం సమకూర్చింది.
దెబ్బతింటున్న కంప్యూటర్లు..
ప్రభుత్వ పాఠశాలల్లో ఏడేండ్లుగా కంప్యూటర్ విద్యను బోధించకపోవడంతో కంప్యూటర్లు, ఇతర సామాగ్రి మూలనపడి పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని పాఠశాలల్లో కంప్యూటర్ల కేబుల్‌ను ఎలుకలు కొరకడం, దీర్ఘకాలికంగా జనరేటర్లు ఉపయోగంలో లేకపోవడంతో ఇంజన్లు దెబ్బతినడం లాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రభుత్వానికి నివేదికలు అందజేశాము
రాము, ఇన్చార్జీ ఎంఈఓ, తొర్రూరు
ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్లు వినియోగంలో లేని పరిస్థితి నెలకొంది. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీ కోసం జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలు అందజేశాము. అయినా పోస్టులను భర్తీ చేయలేదు. సక్సెస్ పాఠశాలల ప్రక్రియను ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో కంప్యూటర్ విద్య నిలిచిపోయింది.
ప్రయోజనం లేదు : శ్రీను బాబు,
ప్రధానోపాధ్యాయుడు, తొర్రూరు హైస్కూల్
సబ్జెక్టు ఉపాధ్యాయుల్లో కంప్యూటర్ విద్య అనుభవం ఉన్న వారితో విద్యార్థులకు కంప్యూటర్ గురించి కనీస అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ సబ్జెక్టు ఉపాధ్యాయులకు పని భారం వల్ల కంప్యూటర్ విద్య అందించలేక పోతున్నాం. కంప్యూటర్లు అందుబాటులో ఉన్నా విద్యార్థులకు వాటి వల్ల ప్రయోజనం లేదు.