Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో గుబులు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో త్వరలో మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించనున్నారు. ఇటీవల హుజురాబాద్ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించిన 'ఈటల' తన నియోజకవర్గంలో మకాం వేసి ప్రచారం చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పర్యటించి వారి సంగతి తేల్చనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలో తొలిగా మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించి హరీశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఉమ్మడి వరంగల్‌జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న పరకాల, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, నర్సంపేట నియోజకవర్గాల్లోనూ 'ఈటల' పర్యటించే అవకాశముంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, నన్నపనేని నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డిలు హుజురాబాద్‌లో మకాం వేసి టీఆర్ఎస్కు ప్రచారం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో 'ఈటల' సిద్దిపేట పర్యటనతో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వర్గాల్లో గుబులు బయలుదేరింది.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన నియోజకవర్గంలో మకాం వేసి కుట్రలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పర్యటించడం ప్రారంభించారు. ఆయన ప్రకటించిన ప్రకారమే తొలుత మంత్రి హరీశ్‌రావు సొంత నియోజకవర్గం సిద్దిపేటలో పర్యటించి ఆయనపై నిప్పులు చెరిగారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, నర్సంపేట ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డిలు రెండు, మూడు నెలలుగా అక్కడే మకాం వేసి 'ఈటల'ను ఓడించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో తనపై కుట్రలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల భరతం పడతానని 'ఈటల' ప్రకటించిన విషయం విదితమే. ఇందులో భాగంగానే ముందుగా సిద్దిపేట నియోజకవర్గంలో 'ఈటల' పర్యటించారు.
ఎమ్మెల్యేలలో గుబులు..
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం కమలాపూర్, జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట మండలాల్లో ఇన్ఛార్జిలుగా వ్యవహరించిన ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, నన్నపనేని నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డిల అనుచరులు 'ఈటల' ప్రకటన నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి హుజురాబాద్‌లో మకాం వేసి సొంత నియోజకవర్గాలను పట్టించుకోకపోవడం, అభివృద్ధిని మరిచి హుజురాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం, వారి సొంత నియోజకవర్గాల్లో ప్రతికూలతను పెంచింది. ఈ క్రమంలో 'ఈటల' పర్యటిస్తే తమ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం లేకపోలేదని స్థానిక ఎమ్మెల్యేల వర్గాలు భావిస్తున్నాయి. ఈ నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ను గెలిపించుకోవడానికి, తనను ఓడించడానికి చేసిన ప్రచారం, వారి ప్రవర్తనపై సైతం 'ఈటల' చర్చ పెట్టే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఉప ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేల ప్రవర్తనపై సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. ఈ విషయాలపై ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ప్రభుత్వ పెద్దలకు నివేదికలను పంపినట్లు సమాచారం.
ప్రతికూలంగా మారనుందా ,,?
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఇన్ఛార్జిలుగా వ్యవహరించడం తమకు కలిసివస్తొందని భావించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అక్కడ 'ఈటల' విజయం ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని 5 మండలాల్లో బలమైన పునాదులున్న గ్రామాల్లోనూ బీజేపీకీ ఆధిక్యత రావడం పట్ల సీఎం కేసీఆర్ ఆగ్రహంతో వున్నట్లు ప్రచారం జరుగుతోంది.
టీఆర్ఎస్ బలంగా ఉన్న గ్రామాల్లో బీజేపీకీ ఆధిక్యత పెరగడం వెనుక కారణాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఓటమికి ఇన్‌ఛార్జిల లోపాలు, అసమర్ధత ఎంత మేరకు కారణమైందన్న విషయంలోను క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతుంది. ఈ అంశాలన్నింటిని విశ్లేషిస్తే వచ్చే ఎన్నికల్లో ఇన్ఛార్జిలుగా వ్యవహరించిన ఎమ్మెల్యేల పార్టీ టికెట్‌కు ఎసరు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఒకవైపు టీఆర్ఎస్ అధిష్టానం ఆగ్రహంగా వుండడం, మరోవైపు 'ఈటల' తమ నియోజకవర్గాల్లో పర్యటించడం పట్ల స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు బయల్దేరింది.