Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూడేండ్లు శ్రమిస్తే 30 ఏళ్లు స్థిర ఆదాయం
జాతీయ పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ మాధుర్
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు ఆర్జించొచ్చని జాతీయ పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ మాధుర్ తెలిపారు. రైతులు మూడేండ్లు శ్రమిస్తే 30 ఏండ్లపాటు స్థిర ఆదాయం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. మండలంలోని కంటాయపాలెంలో ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య పామాయిల్ వ్యవసాయ క్షేత్రంలో 'ఆయిల్ ఫామ్ పంట సాగు-యాజమాన్య పద్ధతులు' అంశంపై శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో డాక్టర్ మాధుర్ మాట్లాడారు. ప్రభుత్వం దేశ అవసరాల కోసం ఏటా రూ.70 వేల కోట్ల విలువైన పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్న క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూనెగింజల సాగును పోత్సహిస్తున్నాయని తెలిపారు. జిల్లాలో 12 వందల ఎకరాల్లో పంట సాగు చేస్తున్నామని చెప్పారు. గతేడాది పైలట్ ప్రాజెక్టు కింద 305 ఎకరాల్లో పంట సాగు చేశామన్నారు. రాష్ట్రంలో సిద్దిపేట తర్వాత మహబూబాబాద్‌లోనే అధికంగా ఆయిల్ ఫామ్ సాగౌతోందని తెలిపారు. ఒక్కో మొక్కపై రూ.33లు సబ్సిడీ లభిస్తుందని, సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందిస్తామని చెప్పారు. జనరల్ కేటగిరీకి 80, బీసీలకు 90, ఎస్సీ, ఎస్టీలకు నూరు శాతం సబ్సిడీ లభిస్తుందని వివరించారు. ఆయిల్ ఫామ్ పంట సాగు చేసే రైతులు 10-12 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చని తెలిపారు. అలాగే టన్నుకు రూ.19 వేలు 800లు ఆదాయం వస్తుందన్నారు. దేశ అవసరాల కోసం 80 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టాల్సి ఉన్నా కేవలం 8 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు అవుతోందని చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని నిర్ణయించి జిల్లాలో ఈ ఏడాది 12 వందల ఎకరాల్లో సాగు చేయడానికి కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. ఎకరాకు రూ.36 వేలు సబ్సిడీ ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని చెప్పారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఈజీఎస్ కింద గుంతల తవ్వకం, మైక్రో ఇరిగేషన్ కింద డ్రిప్ పరికరాలు, అవసరమైన రైతులకు సమీప బ్యాంకులను టైఅప్ చేసి రుణాలు ఇప్పించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. ఆయిల్ ఫెడ్ ద్వారానే ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం అనుమతిస్తుందని చెప్పారు. శాస్త్రవేత్త ఎంవీ ప్రసాద్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగులో తెగుళ్లు, చీడ పీడల బాధ ఉండదన్నారు. ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య మాట్లాడుతూ జిల్లాలోని హరిపిరాలలో తొలిసారిగా 45 ఎకరాల్లో నర్సరీ నెలకొల్పి రూ.7 కోట్ల వ్యయంతో 4 లక్షల మొక్కలను పెంచుతున్నట్లు వివరించారు. మండలంలోని గోపాలగిరిలో ఆయిల్ పామ్ పరిశ్రమ సిద్ధమవుతోందని చెప్పారు. కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ ఏరియా అధికారి సురేష్, ఉద్యాన శాఖ అధికారి రాకేష్, ఉద్యాన అధికారి విష్ణు, తదితరులు పాల్గొన్నారు.