Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోలాటాలతో జోడెడ్ల ప్రతిమల ఊరేగింపు
ఊరు శివారులోని కుంటలో నిమజ్జనం
నవతెలంగాణ-హసన్పర్తి
దేశంలోనే ఎక్కడా లేని సాంప్రదాయం హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం సీతంపేట గ్రామంలో ఉంటుంది. తెలంగాణలో సాధారణంగా సాంప్రదాయ బద్దంగా దసరాకు ముందే తొమ్మిది రోజుల పాటు సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తారు. కానీ ఇక్కడ మాత్రం తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం.. నేతకాని కులస్తులు దీపావళి సందర్భంగా బతుకమ్మ వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ వేడుకలను గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు వేడుకల సందర్భంగా నేతకాని కులస్తులు కేదారీశ్వరస్వామి వ్రతకల్పంలో భాగంగా తొక్కుడు పడని రేగడి మట్టిని సేకరించారు. సేకరించిన రేగడి మట్టిని గంగ నీటిలో నానబెట్టి జోడెద్దుల ప్రతిమలను తయారు చేసి కేదారీశ్వరస్వామి వ్రతకల్పం ముందు ప్రతిష్టించారు. అనంతరం పిండి వంటలతో చేసిన రకరకాల వ్యవసాయ పనిముట్లను తయారు చేసి కేదారీశ్వరస్వామికి మొక్కులు చెల్లించారు.
వేడుకల్లో భాగంగా రెండో రోజున శుక్రవారం పురుషులు మాత్రమే నిర్వహించే జోడెద్దుల ప్రతిమల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిద ప్రాంతాల నుంచి వచ్చిన నేతకాని కులస్తుల కుటుంబ సభ్యులు అందరు కలిసి జోడెద్దుల విగ్రహ ప్రతిమల ఊరేగింపులో పాల్గొని కోలాటం ఆడారు. మహిళలు జోడెద్దుల విగ్రహ ప్రతిమలకు మంగళహారతులు పట్టి సాగనంపారు. జోడెద్దులను కుంటలో నిమజ్జనం చేసేముందు కులపెద్ద ఎద్దుల విగ్రహ ప్రతిమలకు ఆరగింపు నిర్వహించారు. పురుషులంతా కలిసి జోడెద్దులను కుంటలో నిమజ్జనం చేసి వరుసైన వారు నీళ్లు చల్లుకొని సంబురంగా గడిపారు. జోడెద్దుల నిమజ్జనం తరువాత తిరుగు ప్రయాణంలో రకరకాల పూలను సేకరించి ఒక చెంబులో నీటి (గంగ)తో ఇంటికి బయలుదేరారు. ఇంట్లో కేదారీశ్వరస్వామివ్రతం ముందు కూర్చొని వారి వెంట తెచ్చుకున్న గంగను దేవుడికి అభిషేకం చేసారు. కేదారీశ్వరస్వామి ముందు సుంకు పట్టి (కుండలో బియ్యం సేకరించి కొలుచుట) దేవుడి అచ్చాయంగా వారు భావించారు.
మండలంలోని సీతంపేటలో మూడు రోజుల పాటు ప్రత్యేకంగా నిర్వహించే నేతకాని కులస్తుల దీపావళి బతుకమ్మ వేడుకలు శనివారంతో ముగియనున్నాయి. చివరి రోజైన మూడో రోజు శనివారం తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి కేదారీశ్వరస్వామి ఎదుట గౌరమ్మతో ప్రతిష్టిస్తారు. మహిళలు తమ పసుపుకుంకుమలు చల్లగా ఉండాలని, పాడిపంటలు సమృద్దిగా పండాలని, పిల్లాపాలతో చల్లగా ఉండాలని గౌరమ్మను వేడుకుంటారు. శనివారం సాయంకాలం మహిళలు మాత్రమే బతుకమ్మలతో ఊరేగింపుగా ఊరు శివారులోని పెద్ద చెరువు వద్దకు చేరుకొని బతుకమ్మ ఆటపాటలతో సంబురంగా గడుపుతారు. అనంతరం వారు వెంట తెచ్చుకున్న పిండివంటలను పంచుకుంటారు. మంగళసూత్రాలకు పసుపు కుంకుమలతో వాయినాలు ఇచ్చిపుచ్చుకొని పిండివంటలను ఆరగించి బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు. దీంతో నేతకాని కులస్తుల మూడు రోజుల దీపావళి బతుకమ్మ శనివారంతో ముగియనుంది.