Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ మట్టెవాడ
గర్భస్థ లింగ నిర్ధారణ పరిక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ డీఎంహెచ్ఓ డాక్టర్ కే వెంకటరమణ హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్లపై నిఘాతో పాటు, విధివిధానాలపై జిల్లా అడ్వైజరీ సమావేశాన్ని శుక్రవారం స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం నేరమని, ఎవరైనా ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదన్నారు. చట్టానికి లోబడి అన్ని స్కానింగ్ సెంటర్లు నడుచుకోవాలన్నారు. ప్రజలు కూడా బాధ్యతగా ఇలాంటి చట్టవ్యతిరేకమైన లింగనిర్ధారణ పరీక్షలు ఎవరైనా చేస్తున్నట్లుగా తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 104, 1098లకు తెలియజేయాలని కోరారు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను పీహెచ్సీ, పీహెచ్సీ సబ్సెంటర్లలో అందరికీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేస్తామని, కరపత్రాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. స్కానింగ్ సెంటర్లు నడిపేవారు స్కానింగ్ మిషన్లు, రేడియాలజిస్ట్, గైనకాలజిస్ట్లను మార్చిన తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గోపాలరావు, డాక్టర్ ప్రకాష్, గైనకాలజిస్ట్ డాక్టర్ కవిత, లీగల్ ఎక్స్పర్ట్ రేవతి, ఎన్జీఓ మేనేజర్ కవిరాజు, డిప్యూటీ డెమో అనిల్ కుమార్, జమాలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.