Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
అర్హులైన రైతులందరికీ ప్రభుత్వ నిబంధనలకు ప్రకారం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అందిస్తామని డీఆర్వో కుతాటి రమాదేవి తెలిపారు. మండలంలోని జాకారం గ్రామంలో సర్పంచ్ దాసరి రమేష్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన పోడు, ఆర్ఓఎఫ్ఆర్ అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2005 డిసెంబర్ 13 నాటికి పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పట్టలు అందుతాయని చెప్పారు. ఆర్ఓఎఫ్అర్ కమిటీలు, అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పని చేయనున్నట్టు తెలిపారు. పోడు రైతులు అపోహలకు గురి కావద్దని కోరారు. తహసీల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి మాట్లాడుతూ పోడు రైతులు 'ఫారమ్-ఏ' ఇస్తే ఆ మేరకు రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతోపాటు అర్ఓఎఫ్అర్ క్షుణ్ణంగా పరిశీలించి అర్హత ఉంటేనే పట్టా ఇస్తామన్నారు. కమిటీల పాత్ర సమాచారం సేకరించడం వరకేనని, అధికారులే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. పోడు రైతుల భూ వివరాలు తీసుకొని గూగుల్ మ్యాప్ ఆధారంగా విచారణ చేయనున్నట్టు తెలిపారు. ఎస్సీ, బీసీలకు చట్టం ప్రకారం ముందుగా మూడు తరాల నుంచి పరిశీలిస్తామని చెప్పారు. అలాగే గ్రామంలోని సమస్యలను సర్పంచ్, గ్రామ పెద్దలు గండ్రత్ దామోదర్, పిట్టల మధుసూదన్, మామిడిశెట్టి పెద్ద మల్లయ్య, చిన్న మల్లయ్య అధికారులకు వివరించారు. అనంతరం అర్ఓఎఫ్అర్ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఈర్ల చేరాలు, ప్రధాన కార్యదర్శిగా గుగులోత్ రవి ఎన్నికయ్యారు. సమావేశంలో పంచాయతీ కార్యదర్శి సిరంగి మహేందర్, సుక్రు, అటవీ శాఖ బీట్ ఆఫీసర్ సతీష్, తదితరులు పాల్గొన్నారు.