Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ రూరల్
వసతి గృహాల్లోని విద్యార్థులకు సన్న బియ్యం సరఫరా... పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోసం విద్యార్థులకు సన్న బియ్యం సరఫరా... చివరకు ఉచితంగా అందించే రేషన్ కార్డు లబ్దిదారులకు కూడా సన్న బియ్యం సరఫరా... కానీ, అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మాత్రం ప్రభుత్వం దొడ్డు రకం బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఇదేవిషయమై చిన్నారుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో విద్యార్థుల ఇండ్లకే బియ్యం సరఫరా చేశారు. రెండు నెలలుగా లొక్డౌన్ ఎత్తి వేయడంతో అంగన్వాడీ కేంద్రాల్లో దొడ్డు రకం బియ్యంతో వండిన అన్నాన్ని పిల్లలకు పెడుతున్నారు. అంగన్వాడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా తమ చేతుల్లో ఏమీ లేదని దాటవేస్తున్నారు.
జనగామ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 257 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. జనగామ పట్టణంతో పాటు జనగామ మండలం, నర్మెట, తరిగొప్పుల, బచ్చన్నపేట, లింగాలగణపురం మండల పరిధిలో ఈ ప్రాజెక్టు విస్తరించి ఉంది. 1593మంది గర్భిణులు, 1537 మంది బాలింతలు, 12461 మంది చిన్నారులు సేవలు పొందుతున్నారు. చిన్నారులకు రోజుకు 75 గ్రాముల బియ్యాన్ని, 15 గ్రాముల పప్పు, 5 గ్రాముల వంటనూనె, కూరగాయలకు 95 పైసలు ఇస్తున్నారు. ఇక గర్భిణీలకు, బాలింతలకు 150 గ్రాముల బియ్యంతో పాటు 30 గ్రాముల పప్పు, పది గ్రాముల వంటనూనె, రెండు రూపాయల పది పైసలు కూరగాయలకు అందిస్తున్నారు. వీటి ద్వారా మధ్యాహ్నం వారందరికీ బలవర్ధకమైన ఆహారాన్ని వండి వడ్డి స్తున్నారు. 12మంది సూపర్వైజర్లు పని చేయాల్సి ఉండగా ఆరుగురే విధుల్లో ఉన్నారు. ఇందులో ఒకరు డిప్యుటేషన్‌పై హైదరాబాదులో విధులు నిర్వహిస్తున్నారు. దొడ్డు రకం బియ్యం సరఫరా అవుతున్న విషయాన్ని జనగామ సీడపీఓ రమాదేవి వివరణ కోరగా చిన్నారులకు సన్న బియ్యం సరఫరా చేయాలంటూ తాము కూడా ఉన్నతాధికారులకు నివేదించామని వినతులు అందజేశామని తెలిపారు. వారి ఆదేశానుసారం నడుచుకుంటామనడం గమనార్హం.