Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్డీ రాష్ట్ర కార్యదర్శివర్గ
సభ్యుడు గోవర్ధన్
నవతెలంగాణ-కొత్తగూడ
ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను వృథా కానివ్వమని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గోవర్ధన్ తెలిపారు. నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించేందుకు ఐక్యపోరాటాలు నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆ పార్టీ కొత్తగూడ సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు శ్రీశైలం అధ్యక్షతన పాలడుగు కష్ణ స్మారక భవనం ఆవరణలో ఆదివారం పాలడుగు కష్ణ స్మారక బహిరంగ సభ నిర్వహించారు. తొలుత మండల కేంద్రంలోని వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి పాలడుగు కష్ణ స్మారక స్తూపంపై ఎర్రజెండా ఎగరేసి ఘనంగా నివాళ్లర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గోవర్ధన్ మాట్లాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో పాలన సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల ఆస్తులను, లాభాల్లో ఉన్న భారీ ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నష్టదాయక వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతోపాటు పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని, పోడు రైతులందరికీ పట్టాలివ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతో భూములను లాక్కుంటోందని విమర్శించారు. కొత్తగూడ, గంగారం మండలాలకు సాగు నీరు కల్పించడం లేదన్నారు. స్వరాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలిందని ఆందోళన వెలిబుచ్చారు. సీఎం కేసీఆర్ మోసపూరిత మాటలతో దుష్టపాలన సాగిస్తున్నారని విమర్వించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ అవలంభిస్తున్న తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా అన్ని తరగతుల ప్రజలు ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. సభలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌని ఐలయ్య, జిల్లా నాయకులు బూర్క వెంకటయ్య, పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు ఆగబోయిన నర్సక్క, మానవ హక్కుల సంఘం నాయకులు బండి కోటేశ్వర్రావు, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజరు కన్నా, ఏఐకేఎంఎస్ మండల ప్రధాన కార్యదర్శి యాదగిరి యుగేందర్, అధ్యక్షుడు బూర్క బుచ్చిరాములు, మంగన్న, లక్ష్మయ్య, యాప వెంకటయ్య, పూనెం మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.