Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపురం
ఆదివాసీల సాగులో ఉన్న పోడుభూములకు పట్టాలివ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు దావూద్ ప్రభుత్వాన్ని డిమాండ్ ఛేశారు. స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌజ్‌లో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సమావేశానికి దావూద్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎఫ్ఆర్సీల్లో రాజకీయ పార్టీల జోక్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పొడుభూములకు హక్కు పత్రాలు ఇస్తున్నట్లు చూపుతూ ఆచరణలో అటవీ హక్కుల చట్టానికి వ్యతిరేకంగా చర్యలు చేపడుతోందని విమర్శించారు. ఎఫ్ఆర్సీలను ఆవాసాల వారీగా వేయాలని, కమిటీల్లో రాజకీయ నాయకులు జోక్యం లేకుండా అధికారులు చూడాలని కోరారు. మండలంలో పొడుభూములకు హక్కు పత్రాలు కల్పించే ఎఫ్ఆర్సీలు టీఆర్ఎస్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని చెప్పారు. మండల రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నాయకులతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుని ఆదివాసీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎఫ్ఆర్సీలను పారదర్శకంగా నిర్వహించని పక్షంలో పొడు సాగుదారులను ఐక్యం చేసి పోరాటాలు నిర్మించి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం నాయకులు జెజ్జరి దామోదర్, వంకా రాములు, సీపీఐ(ఎం) నాయకులు గ్యానం వాసు, గుండమల్ల ప్రసాద్, కారం వెంకటనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.