Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
1995-96 నాటి టెన్త్ స్నేహితులు ఔదార్యం చాటారు. తమతో కలిసి టెన్త్ చదువుకుని నాలుగేండ్ల క్రితం ప్రమాదం బారిన పడ్డ స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకునేలా రూ.65 వేలతో పాన్ షాప్ ఏర్పాటు చేయించి ఉపాధి కల్పించారు. నాటి మిత్రుడికి అండగా నిలిచారు. వివరాలిలా.. మండలంలోని తిమ్మంపేట గ్రామానికి చెందిన గోనె నరేందర్ నాలుగేండ్ల క్రితం ప్రమాదానికి గురి కాగా కాలు విరిగి నడవలేని స్థితికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడి కుటుంబం ఇబ్బంది పడుతుండగా అతడితో కలిసి 1995-96లో టెన్త్ చదివిన విద్యార్థులు కలిసికట్టుగా రూ.65 వేలు సమీకరించి గ్రామంలో పాన్ షాప్‌ను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా నరేందర్ స్నేహితులు మాట్లాడారు. తమతో కలిసి టెన్త్ చదివిన స్నేహితులెవరికి ఆపద కలిగినా అండగా ఉండాలని తాము నిర్ణయించుకున్నట్టు తెలిపారు. నరేందర్ కుటుంబానికి భవిష్యత్‌లోనూ అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ఏటూరునాగారం ఆత్మ కమిటీ చైర్మెన్ దుర్గం రమణయ్య, ఎర్ర మన్మధరావు, అడవాల సురేష్, బొల్లా ప్రసాద్, మాచర్ల శశిధర్, బొమ్మెర శంకర్రావు, అల్తాఫ్, అఫ్జల్, దంతనపల్లి రమేష్, పల్లాపు వెంకటేశ్వర్లు, మైప లాలయ్య, డీజే రాజేష్ తదితరులు పాల్గొన్నారు.