Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపురం
బినామీ కాంట్రాక్టర్ల తీరుతో ఏజెన్సీ గిరిజనుల నడుమ ఇసుక తుఫాన్ చేలరేగుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పచ్చటి పొలాల్లో పని చేస్తూ జీవిస్తున్న గిరిజనుల నడుమ బినామీ కాంట్రక్టర్లు చిచ్చు పెడు తున్నారు. ఇసుక రీచ్‌ల కోసం ఇటీవల మండలంలోని సూర వీడు కాలనీ, రామానుజాపురం ఇసుక సోసైటీల వ్యవహరం లో ఆదవాసీ గిరిజనులు పరస్పర దాడులు చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు చేరిన పరిస్థితి ఆదివాసీ గిరిజనుల నడుమ ఇసుక తుఫాన్ తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ అలజడికి, అశాంతికి ఇసుక ర్యాంపులే కారణమని ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇసుక రీచ్‌లను దక్కించుకోవడానికి ఏజెన్సీలో తిష్ఠ వేసిన కొందరు బినామీ కాంట్రాక్టర్ల ప్రలోభాలతో గ్రామాల్లో ఆదివాసీలు గ్రూపులుగా చీలిపోయిన దుస్థితి నెలకొంది. ములుగు జిల్లాలో వెంకటాపురం మండలంలో బినామీ కాంట్రాక్టర్ల ఆగడాలు పెరిగిపోవడంతో తరచూ శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది. నిబంధనలకు విరుద్ధంగా బినామీ కాంట్రాక్టర్ల కు సహకరిస్తున్న అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం కొసమెరుపు.
షెడ్యూల్డు ప్రాంతాలకు పీసా చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలోని ఇసుక రీచ్‌లు ఆదివాసీ సహకార సంఘాలకే కేటాయించాల్సి ఉంది. గ్రామసభల తీర్మానంతో ఇసుక రీచ్ లను సహకార సంఘాలకే కేటాయిస్తున్నప్పటికీ ఆ సంఘాల వద్ద పెట్టుబడులు లేకపోవడంతో బినామీ కాంట్రాక్టర్లు రంగ ప్రవేశం చేశారు. సహకార సంఘాలకు పెట్టుబడులను సమ కూర్చడానికి ట్రైకార్తోపాటు బ్యాంకుల సహకారం తీసుకునే అవకాశం ఉంది. సహకార సంఘాలతో ఒప్పందం చేసుకునే
తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ కూడా బ్యాంకులకు కౌంటర్ గ్యారంటీ ఇచ్చే వీలుంది. ఈ దిశగా అధికార యంత్రాంగం చర్యలూ తీసుకోలేదు. ఆదివాసీ సహకార సంఘాలను పరిపుష్టం చేయడానికి అధికారులెవరూ చొరవ చూపలేదు. బినామీ కాంట్రాక్టర్లు చెల్లించే ముడుపుల కోసమే అధికార యంత్రాంగం వారిని అడుగడుగునా ప్రోత్సహిస్తున్నట్టు ఆదివాసీ సంఘాలు విమర్శిస్తున్నాయి.
కాగితాలకే పరిమితమైన నిబంధనలు
అనుమతులు పొందిన రీచ్‌ల్లో ఇసుక తవ్వకాల కోసం ఆదివాసీ సహకార సంఘాలతో ఖనిజాభివద్ధి సంస్థ ఒప్పం దాలు చేసుకుంటోంది. ఈ ఒప్పంద పత్రాల్లో రైజింగ్ కాంట్రాక్టర్లుగా సహకార సంఘాలను పేర్కొంటోంది. నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలు, డంపింగ్ యార్డు వరకూ రవాణా సహకార సంఘాలే చేపట్టాలి. కాంట్రాక్టర్ల ను నియమించవద్దని, థర్డ్ పార్టీ అగ్రిమెంట్లు చెల్లవని సైతం టీఎస్ఎండీసీ నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నిబం ధనల గురించి తెలియని ఆదివాసీ సహకార సంఘాలు బినామీ కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లు చేసుకుంటున్నాయి. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోంది.
అడుగడుగునా అవినీతి
కీలక శాఖల అధికారుల అవినీతి కారణంగానే బినామీ కాంట్రాక్టర్లు చెలరేగిపోతున్నారు. బినామీ కాంట్రాక్టర్ల వ్యవస్థను బహిరంగంగా అధికారులే ప్రొత్సహిస్తుండడంతో ఏజెన్సీ ఇసుక రీచ్‌లను దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు పోటీ పడుతున్నారు. సహకార సంఘాలను నమోదు చేయించడం నుంచి మొదలుకొని ఇసుక రీచ్‌లను మంజూరు చేయించే వరకు అడుగడుగునా వారు చక్రం తిప్పుతున్నారు. రీచ్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత వివిధ శాఖల అధికారులు చేసే జాయింట్ సర్వే కీలకం కావడంతో ఈ సందర్భంగానే భారీగా డబ్బు చేతులు మారుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్వే కోసం వచ్చే రెవెన్యూ, మైనింగ్, గ్రౌండ్ వాటర్, ఇరిగేషన్ శాఖల అధికారులకు భారీగా లంచాలు ఇస్తున్నట్టు కాంట్రాక్టర్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇసుక క్వాంటిటీని నిర్ణయించే భూగర్భ జల శాఖ అధికారులు క్యూబిక్ మీటర్‌కు నిర్ణీత ధర నిర్ణయించి ముడుపులు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఫైల్ నడిపినందుకు మైనింగ్ శాఖ అధికారులకు, పట్టా భూములైతే రెవెన్యూ, వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులకు లక్షలాది రూపాయలు చెల్లిస్తున్నామని కాంట్రాక్టర్లు చెప్పుకుంటున్నారు. కొందరు అధికారుల వాయిస్‌ను కూడా కాంట్రాక్టర్లు రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ప్రచారంలో ఉంది. సహకార శాఖ అధికారుల తీరు కూడా జిల్లాలో ప్రశ్నార్థకంగా మారింది. కాంట్రాక్టర్లు కోరిన విధంగా ఎక్కడ పడితే అక్కడ ఇసుక సొసైటీలు నమోదు చేశారు. పలు సంఘాల్లో గతంలో సభ్యులుగా ఉన్న వారితో కొత్త సొసైటీలు నమోదు చేసి భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. గ్రామాల్లో అర్హులైన వారికి సభ్యత్వం ఇవ్వకుండా తమకు అనుకూలంగా ఉండే ఆదివాసీలకే సభ్యత్వం ఇప్పించడం, ఎదురు తిరిగిన వారి సభ్యత్వాలను తొలగించడం, నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించక పోవడం పరిపాటిగా మారింది. ప్రతి పనికీ రేటు నిర్ణయించి కాంట్రాక్టర్ల వద్ద ముడుపులు తీసుకుని వివాదాస్పదంగా సహకార శాఖ అధికారులు మారిపోయారు. వీరి వైఖరితోనే ఆదివాసీ గ్రామాల్లో గొడవలు ప్రారంభమయ్యాయి. ఖనిజాభివద్ధి శాఖ అధికారులు కూడా ఇసుక రీచ్‌లను బినామీ కాంట్రాక్టర్లకు అప్పగించినందుకు భారీగా లబ్ది పొందుతున్నారు. అగ్రిమెంట్, ఆన్లైన్, బిల్లులు చేసే సందర్భంలోనూ, అక్రమంగా మిషన్లు పెట్టినందుకూ కాంట్రాక్టర్ల వద్ద భారీగా ముడుపులు తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు ఆధారాలతో సహా చూపుతున్నారు.
బినామీ కాంట్రాక్టర్లతో కలహాలు..
ఇసుక రీచ్‌ల కోసం పోటీపడే కాంట్రాక్టర్లతో ఆదివాసీ గ్రామాలు అట్టుడుకుతున్నాయి. ఆదివాసీలను గ్రూపులుగా విడదీసి తమకు అనుకూలంగా తిప్పుకోవడంతో ప్రతి రోజూ వివిధ గ్రామాల ఆదివాసీలు భౌతిక దాడులకు దిగుతున్నారు. ఇటీవల వెంకటాపురం మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటువంటి సంఘటనలు జరిగినా అధికార యంత్రాంగం కన్నెత్తి చూడలేదు. ఇసుక రీచ్‌ల ద్వారా ఆదివాసీలకు వచ్చేది నామ మాత్రం కాగా కాంట్రాక్టర్లు, అధికారుల వైఖరితో నష్టం ఎక్కువ జరుగుతోంది.