Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఐటీయూ ఆధ్వర్యంలో సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ కాజీపేట
మున్సిపల్ కార్మికులకు పెరిగిన వేతనాలు అందజేయాలని సీఐటీయూ మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఉప్పలయ్య, సీఐటీయూ మాజీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి చుక్కయ్య అన్నారు. గ్రేటర్ వరంగల్లో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు కొట్లాడి సెలవు దినాలను సాధించుకున్నారు. ఈ క్రమంలో కొంత మందికి ఆదివారం, మరికొంత మందికి గురువారం సెలవును ప్రకటించారు. అయితే కార్మికుల సెలవులు రద్దుచేసి వారితో కట్టు బానిసలాగా పని చేయించుకోవడాన్ని నిరసిస్తూ సోమవారం కాజీపేట సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్యక్రమం స్వచ్ఛభారత్ నిబంధనల పేరు చెప్పి కమిషనర్ ఆదివారం సెలవు రద్దు చేయడంతో కార్మికులు మనోవేదనకు గురవుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులకు 16,600వేతనంగా చెల్లిస్తున్నారన్నారు. అయితే ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో టీఆర్ఎస్, బీజేపీ ప్రజా ప్రతినిధులు కుమ్మక్కయి 15,600మాత్రమే ఇవ్వాలని తీర్మానం చేయడం దుర్మార్గమన్నారు. వెంటనే గత పదేండ్లుగా కొనసాగుతున్న గురువారం, ఆదివారం సెలవులను కొనసాగించాలని, రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన వేతనాలు చెల్లించి, పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే మున్సిపల్ కార్మికుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.