Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రణరంగంగా మారిన కలెక్టరేట్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
పెండింగ్ స్కాలర్షిప్లను, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి రణరంగంగా మారింది. ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మిస్రీస్ సుల్తానా, భాషబోయిన సంతోష్‌ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులకు, ఎస్ఎఫ్ఐ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం కలెక్టర్‌ను కలిసి వారు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. రెండేండ్ల నుంచి ప్రభుత్వం స్కాలర్షిప్లు, ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయన్నారు. దీంతో నిరుపేద విద్యార్థులు చదువు మానేసే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వరంగల్, గజ్వేల్‌లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదన్నారు. కేసీఆర్‌కు ఓట్లు, సీట్ల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్‌పై లేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.12.5లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించాల్సి ఉందని, ఇందుకు రూ.2400కోట్లు అవసరమవుతాయని తెలిపారు. కనీసం బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించకపోవడం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని పేర్కొన్నారు. 2020, 2021 సంవత్సరాలకు సంబంధించిన మొత్తం రూ.3100కోట్లు బకాయిలు ఉన్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నాన్‌టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బంధీగా అమలుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మంద శ్రీకాంత్, కె.ఉపేందర్, రవి, తేజ, చరణ్, జిల్లా కమిటీ సభ్యులు చంటినాయక్, రాజు, శ్రీకాంత్, యూనివర్సిటీ నాయకులు వేణు, వీరాంజనేయులుతోపాటు సుమారు 300మంది విద్యార్థులు పాల్గొన్నారు.