Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామానికి చెందిన నాసిరెడ్డి విజరుభాస్కర్‌రెడ్డి సేవలు అభినందనీయమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఆ గ్రామంలో విజరుభాస్కర్‌రెడ్డి కుమారుడు వినరుకుమార్‌రెడ్డి స్మారకంగా ఏర్పాటు చేసిన వైకుంఠధామాన్ని ఎమ్మెల్యే సీతక్క మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. గ్రామంలో వైకుంఠధామం లేక ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూసి తమకున్న ఎకరా స్థలాన్ని దానం చేసి సుమారు రూ.10 లక్షల వ్యయంతో సకల సౌకర్యాలు కల్పించడం అభినందనీయమని తెలిపారు. వినరుకుమార్‌రెడ్డి పేరిట విజయభాస్కర్‌రెడ్డి ట్రస్ట్ ఏర్పాటు చేసి జాతీయ మిర్చి టాస్క్‌ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డితో కలిసి గ్రామాభివద్ధికి పాటుపడడం స్ఫూర్తినిస్తోందని తెలిపారు. సమాజంలో ఎందరో డబ్బులు సంపాదిస్తారని, కొందరు మాత్రమే సంపాదనలో కొంత స్వగ్రామానికి కేటాయిస్తారని, అలాంటి కోవలోకే నాసిరెడ్డి బ్రదర్స్ వస్తారని చెప్పారు. ఇప్పటికే విజయభాస్కర్‌రెడ్డి కుమారుడి పేరిట లక్ష రూపాయల విలువైన శీతల శవపేటికను గ్రామ పంచాయతీకి అందించారని, గ్రామంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.25 వేలతో కూలింగ్ చలివేంద్రం ఏర్పాటు చేశారని తెలిపారు. వైకుంఠధామంలో షెడ్, బోర్వెల్ నిర్మాణాలకు రూ.5 లక్షలు మంజూరు చేస్తానని సీతక్క హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పూజారి సురేందర్ బాబు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పాడి దామోదర్‌రెడ్డి, లక్కీ వెంకన్న, ధూళిపాల బాలకృష్ణ, దూలగుండ నారాయణ, అయ్యోరి యానయ్య, యూత్ అధ్యక్షుడు నరేందర్, ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెంకట్‌రెడ్డి, దుర్గాప్రసాద్, సుబ్రహ్మణ్యం, నరేష్, రవి, దాట్ల శ్రీనివాస రాజు పాల్గొన్నారు.