Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
ఏజెన్సీ ప్రాంతంలో పులి ఆనవాళ్ల నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు ఏఎస్పీ పోతరాజు సాయి చైతన్య అన్నారు. బుధవారం ఆయన జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. జిల్లాలోని అటవీ ప్రాంతంలోకి పులి ప్రవేశించినట్టు అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ధ్రువీకరించినట్టు పేర్కొన్నారు. పులి కదలికల వివరాలను ఎప్పటికప్పుడు పోలీస్, అటవీశాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సేకరిస్తున్నారని పేర్కొన్నారు. వన్యప్రాణులను వేటాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత నెలలో పులిని వేటాడిన వారిని జైలుకు పంపించినట్టు తెలిపారు. అటవీ ప్రాంతాలలో పులి అనవాళ్లు కనిపిస్తే వెంటనే అటవీశాఖ, పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
అటవీ ప్రాంతంలోపలికీ వెళ్లొద్దు..
పోడు సాగుదారులు, పశువుల కాపరులు, ప్రజలు అటవీ ప్రాంతంలో లోపలికి వెళ్లొద్దని జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెటి సూచించారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో కెమెరా ట్రాప్స్ నిఘా పటిష్టం చేసినట్లు పేర్కొన్నారు. వివరించారు. పులి కదలికలను పరిశీలించేందుకు ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అటవీశాఖ అధికారులు వివిధ గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించి వేటకు సంబంధించిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పులి సమాచారం తెలియజేసే వారికీ నగదు పారితోషికం అందజేస్తామన్నారు. పులి గ్రామాల్లోని పశువులను వేటాడి చంపినట్టయితే బాధితులు అటవీశాఖ అధికారులు సమాచారం ఇవ్వాలని, వారికి నష్టపరిహారాన్ని అందజేస్తామని పేర్కొన్నారు.
నవతెలంగాన-కన్నాయిగూడెం
ఏటూరునాగారం ఫారెస్టు అధికారులు, పోలీసులు బుధవారం గుత్తిగోయ గుంపు గుట్టల గంగారం గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఐ కిరణ్కుమార్ ఆ గ్రామ ప్రజల తో మాట్లాడారు. అడవిలో పులి సంచారం నేపథ్యంలో ఎవరూ ఒంటరిగా వెళ్లకూడదన్నారు. ఎవరికైనా పులి కనబడితే భయపడకుండా నిదానంగా వెనక్కు అడుగులేస్తూ పెద్దగా అరుస్తూ అక్కడ నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఆయన వెంట ఎస్సై రాజు, పోలీసు, ఫారెస్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు.