Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ శశాంక వైద్యులను, సిబ్బందిని ఆదేశించారు. మండలంలో గురువారం పర్యటించిన సందర్భంగా ఆయన తొలుత కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసూతి విభాగం, ఆయుష్ క్లినిక్, డెంటల్ క్లినిక్, ఓపీ విభాగాన్ని సందర్శించి పరిశీలించారు. వైద్య సేవల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ భూక్యా వెంకట్రాములు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమా వేశంలో వైద్యులతో కలెక్టర్ మాట్లాడారు. ఆధునిక వైద్య సామాగ్రి అందుబాటులో ఉన్న ప్రజలకు అందకపోవడం సరికాదన్నారు. పని తీరు మెరుగు పడకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలను ప్రోత్సహించాలని చెప్పారు. పైల్స్, హెర్నియా లాంటి శస్త్రచికత్సలు నిర్వహించాలని సూచించారు. ఆస్పత్రి ఆవరణలో శుభ్రతకు చర్యలు తీసుకోవాలని, వారానికి రెండుసార్లు పారిశుధ్య పనులు చేపట్టి రిజిస్టర్లో నమోదు చేయించాలని మండల ప్రత్యేక అధికారికి సూచించారు. ఆస్పత్రి ప్రహరీ, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణను పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. చెత్తాచెదారాన్ని తొలగించి ఫొటోలను అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి ఛత్రు నాయక్, డీసీహెచ్ఎస్ భూక్య వెంకట్రాములు, తహసీల్దార్ శైలజ, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ వీరన్న, డాక్టర్లు రాజు, కటయ్య, భరత్‌రెడ్డి, శివశంకర్, అరవింద్ కుమార్, శశిధర్‌రెడ్డి, ప్రావీణ్య, సంతోష్ కుమార్, రమేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.