Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేడారం జాతరపై సమీక్ష
జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ-ములుగు
మేడారం జాతర పనుల నిర్వహణలో అధికారులు సమర్ధవంతంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మేడారంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆర్డబ్ల్యూఎస్, పీఆర్, ఆర్ అండ్ బీ, పోలీస్ శాఖలతో కలెక్టర్ సమీక్షించారు. అధికారులు చేపట్టాల్సిన పనులకు సంబంధించి టెండర్లు పిలిచి సౌకర్యాలు కల్పించడంలో నిమగం కావాలన్నారు. మేడారం అతి పెద్ద గిరిజన జాతర అయిన నేపథ్యంలో, సమయం తక్కువగా ఉన్న క్రమంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు చేపట్టాలని చెప్పారు. రోడ్లు భవనాల శాఖ ద్వారా వివిధ రోడ్లకు సంబంధించి తాడ్వాయి-నార్లాపూర్, చిన్నబోయినపల్లి-కొండగుట్ట, పస్రా-మేడారం రోడ్లతో పాటు హెలీప్యాడ్ మరమ్మతులు, నిర్మాణం, గెస్ట్ హౌస్ నిర్మాణం, తదితరాల అంచనాను పరిశీలించి టెండర్ ప్రక్రి య నిర్వహచేలా చూడాలన్నారు. అలాగే పీఆర్ శాఖ ద్వారా కాల్వపల్లి-ఊరట్టం, సీసీ అప్రోచ్ రోడ్లు చల్వాయి నుంచి బుస్సాపుర్ పనులకు సంబంధించి టెండర్లు పిలవాలని ఆదేశించారు. తాగునీటి, ఇతర సౌకర్యాలు కల్పించడంలో సమస్యలు తలెత్తకుండా చూడాలని చెప్పారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో రమాదేవి, ఏఎస్పీ సాయి చైతన్య, సీపీఓ ప్రకాష్, ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేష్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ మాణిక్యరావు, పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏఓ శ్యాంకుమార్, తదితరులు పాల్గొన్నారు.