Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష పాటిస్తున్నాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ విమర్శించారు. మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను గురువారం దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నంబూరి మధు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆటలాడుతున్నాయని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రాన్ని రాష్ట్ర, రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వాలు నిందిస్తూ రైతులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. బీజేపీ నాయకులు రైతులను వరి సాగు చేయాలని ప్రోత్సహిస్తుండగా మరోవైపు సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయ పంటలు పండించాలని ప్రకటించడం రైతులను గందరగోళానికి గురి చేసేలా ఉందన్నారు. వరి పండించొద్దని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం వరి సాగయ్యే భూముల్లో ఏ పంట పండించాలో స్పష్టత ఇవ్వాలన్నారు. రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని గతంలో సీఎం స్వయంగా చెప్పి ప్రస్తుతం మాట మార్చడం దుర్మార్గమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాల వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులు వరి సాగు చేసుకునే అవకాశం కల్పించడంతోపాటు ధాన్యాన్ని గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఆలవాల వీరన్న, మండా రాజన్న, నాయకులు నిడికొండ చంటి, తొడుసు యాదగిరి, వెంకన్న, మోహన్, పెంటయ్య, మేరుగు వెంకన్న, శ్రీను తదితరులు పాల్గొన్నారు.