Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
గిరిజనులతో సమానంగా గిరిజనేతరులకు సైతం పోడు హక్కు కల్పించాలని మహబాద్ జెడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆమె మంత్రి సత్యవతి రాథోడ్‌ను జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం కలిసి వినతిపత్రం అందించి మాట్లాడారు. ఏజెన్సీలో అనేక తరాలుగా పోడు సాగు చేసుకొని కుటుంబాలను పోషించుకుంటున్న మండల గిరిజనేతర రైతులకు హక్కులు కల్పించాల్సిందేనని చెప్పారు. 2005 డిసెంబర్ నాటికి పోడు సాగులో ఉన్న గిరిజనేతర రైతులకు సైతం ఆర్ఓఎఫ్ఆర్ భూమి హక్కు పట్టాలు మంజూరు చేయాలని, సాదాబైనామా కింద దరఖాస్తు చేసుకున్న రైతులకు పట్టాలిచ్చి రైతు బీమా, ఇతర సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మెన్ మూల మధూకర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ రాసమళ్ల నాగేశ్వర్రావు, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు అంగోత్ శ్రీకాంత్ నాయక్, నాయకులు తమ్మిశెట్టి వెంకటపతి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నంబూరి మధు, సీపీఐ మండల కార్యదర్శి సారిక శ్రీను, సర్పంచ్ వజ్జ అనసూర్య, సొసైటీ డైరెక్టర్ కసనబోయిన శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.