Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
మండలంలోని పోలెపల్లి గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. గ్రామ పంచాయతీ పాలకవర్గంతో ప్రజాప్రతినిధుల, అధికారుల సమన్వయంతోపాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సహకారం వల్లే పోలెపల్లిలో నూతన శోభ సంతరించుకుందని తెలుస్తోంది. గతంలో అభివృద్ధికి ఆమడ దూరంగా ఉండగా సర్పంచ్‌గా యాకయ్య బాధ్యతలు చేపట్టన నిరంతర కృషి చేస్తున్న ఫలితంగానే పల్లె పరిఢవిల్లుతోంది. ప్రగతి పరవళ్లు తొక్కుతోంది. అనతికాలంలోనే ఎక్కువ అభివృద్ధి చెందిన పల్లెగా ప్రఖ్యాతి గాంచింది. పల్లె ప్రగతిలో స్మశానవాటిక, కంపోస్ట్ షెడ్, పల్లె ప్రకృతి వనం నిర్మాణంతోపాటు డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. గ్రామ రహదారికి ఇరువైపులా అహ్లాదం పంచేలా మొక్కలు నాటడంతోపాటు సీసీ రోడ్లు నిర్మించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలెపల్లిలో అభివృద్ధిపై 'నవతెలంగాణ' కథనం..
తొర్రూరు మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలేపల్లి ఇతర గ్రామ పంచాయతీలతో అభివద్ధిలో పోటీ పడుతూ ముందంజలో నిలుస్తోంది. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివద్ధి చేసేందుకు సర్పంచ్ యాకయ్య ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గ్రామంలో అభివద్ధి పనులు జోరందుకున్నాయి. పల్లె ప్రగతిలో నిర్వహించాల్సిన పనులను సకాలంలో పూర్తి చేశారు. సర్పంచ్ చొరవతో గ్రామంలో అనతికాలంలోనే అభివృద్ధి పనులను ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యతా ప్రమాణాలతో చేపట్టారు. అభివృద్ధి పనుల నిర్వహణలో ప్రణాళికాయుంగా ముందుకు సాగుతూ సర్పంచ్ తనదైన శైలిలో ముందుకు నడిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేక నిధులను కేటాయించడంతో పల్లె ప్రగతి పనులకు భారీగా నిధులను కేటాయించడంతో గ్రామంలో అభివద్ధి పనులు పూర్తి చేశారు. మరిన్ని నిధులను తీసుకొచ్చి గ్రామ పంచాయతీని అభివద్ధి పథంలో నిలిపేందుకు సర్పంచ్ అవిశ్రాంతంగా పాటుపడుతున్నారు.
ఆహ్లాదకరం.. పల్లె ప్రకృతి వనం
గ్రామ శివారులో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి అందులో అన్ని రకాల మొక్కలను నాటారు. ప్రభుత్వ నిర్ధేశించినవే కాకుండా ఇతర రకాల మొక్కల పెంపకాన్ని కూడా చేపట్టారు. ప్రకృతికి ఊతమిచ్చే, ప్రజారోగ్యానికి బాటలు వేసే మొక్కలను సైతం నాటడం ప్రత్యేకతగా చెప్పవచ్చు.
స్మశానవాటిక, కంపోస్ట్ షెడ్ నిర్మాణం పూర్తి
గ్రామ పంచాయతీలో స్మశానవాటిక, కంపోస్ట్ షెడ్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. కంపోస్ట్ ఎరువు తయారీకి చర్యలు తీసుకుంటున్నారు. కంపోస్ట్ షెడ్లో వివిధ రకాల వ్యర్థాలను వేరు చేసే దిశగా ఎనలేని చొరవ తీసుకుంటున్నారు.
పరిసరాల శుభ్రతకు ప్రాధాన్యత
గ్రామంలో పరిసరాల శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతిఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించేలా అవగాహన కల్పించి చైతన్యవంతం చేశారు. మురుగునీటి కాల్వలు సరిగా లేక దోమలు ప్రబలిన పరిస్థితి గతంలో ఉండగా ప్రస్తుతం సర్పంచ్ యాకయ్య చొరవతో పల్లె ప్రగతి ద్వారా పారిశుధ్య పనులు చేపట్టారు. గ్రామంలో దోమల బెడద తప్పిందంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజూ గ్రామంలోని చెత్తను గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా తడి, పొడిగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దీంతో గ్రామ పరిసరాలు శుభ్రతకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి.
రోడ్డుకు ఇరువైపులా చెట్లు
పల్లె ప్రగతిలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని సంరక్షించే దిశగా ప్రణాళికాయుతంగా కార్యాచరణ చేపట్టారు. దీంతో గ్రామానికి వెళ్లే దారిలో ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. రహదారి పచ్చదనానికి అద్దం పడుతోంది. గ్రామ పంచాయతీ పరిధిలో పల్లె ప్రగతి అభివద్ధి పనులు ఒకే దగ్గర పూర్తి చేయడం పల్లెకు మరింత అందాన్ని చేకూర్చిందని చెప్పక తప్పదు. స్మశానవాటిక, డంపింగ్ యార్డు ఏర్పాటు, కంపోస్ట్ షెడ్ నిర్మాణం, పల్లె ప్రకతి వనం, తదితర పనులు నిర్వహించారు.
ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుతాం : పందుల యాకయ్య, సర్పంచ్
ఇప్పటికే గ్రామంలో అనేక అభివద్ధి పనులు నిర్వహించాము. స్మశానవాటిక నిర్మాణం, డంపింగ్ యార్డు, పల్లె ప్రకతి వనం ఏర్పాటు చేశాం. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సహకారంతో గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. గ్రామంలో అభివద్ధి పనులకు మంత్రితోపాటు ఎంపీపీ అంజయ్య, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ క్రియాశీలకంగా సహకరిస్తున్నారు. అందరి సహకారంతో గ్రామాన్ని మండలంలో ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుతాం.