Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ వ్యవసాయ మార్కెట్లో రైతులపై జరుగుతున్న దాడులను అరికట్టి, తగిన రక్షణ కల్పించాలని ఏఐకేఎస్ సీసీ నాయకులు డిమాండ్ చేశారు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో రైతు కోడిపల్లి రాజుపై దాడిని నిరసిస్తూ శుక్రవారం మార్కెట్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకెేఎస్ సీసీ జిల్లా కన్వీనర్ పెద్ధారపు రమేష్, కో-కన్వీనర్లు సోమిడి శ్రీనివాస్, రాచర్ల బాలరాజు, జిల్లా నాయకులు చిర్ర సూరి, సుదమల్ల భాస్కర్, బీరం రాములు, వల్లందాస్ కుమార్‌లు మాట్లాడారు. రైతులపై దాడులకు పాల్పడే ఆడ్తి వ్యాపారుల లైసెన్సులు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. షణ్ముఖ ట్రేడర్స్ లైసెన్స్ రద్దు చేసి దాడికి పాల్పడిన పురుషోత్తంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులే మార్కెట్ వ్యవస్థకు జీవనాధారమని దీనిని మార్కెట్ అధికారులు, వ్యాపారులు గమనించాలన్నారు. లేనియెడల మార్కెట్ వ్యవస్థ కుంటుపడుతుందని హెచ్చరించారు. అనంతరం డీఎంఓ ప్రసాదరావు, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి బీవీ రాహుల్‌లకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి కుమారస్వామి, రైతు సంఘాల నాయకులు ఎన్ రెడ్డి హంసా రెడ్డి, ఓదెల రాజయ్య, దామరకొండ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.