Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరకాల
రైతుల పేరుతో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు నాటకాలాడుతున్నాయని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు మంద శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎస్ఎఫ్ఐ ముఖ్యకార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ టీఆర్ఎస్, బీజేపీలు కొత్త నాటకాలకు తెరతీశాయన్నారు. రైతులు ఇబ్బందిపడుతుంటే ఈ రెండు పార్టీలు రాజకీయం చేస్తూ దొంగ ప్రేమ చూపిస్తున్నారన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, నెలల తరబడి రైతులు పోరాడుతుంటే పట్టించుకోని ప్రభుత్వాలకు ఇప్పుడెందుకు రైతులు గుర్తొచ్చారని ప్రశ్నించారు. శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి కొడుకు తన వాహనాలతో ఎక్కించి ప్రాణాలు తీశారని, ఇలాంటి ప్రభుత్వాలా రైతులకు న్యాయం చేసేవని మండిపడ్డారు. ప్రతిపక్షాలు, వామపక్షాలు ధర్నాలకు పిలుపునిస్తే ముందస్తు అరెస్టులు చేసే పోలీసులు అధికారపార్టీ నాయకులనేందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, ప్రైవేటు సంస్థలకు అప్పగించిన ప్రభుత్వరంగ సంస్థలను తిరిగి ప్రభుత్వపరం చేసుకోవాలన్నారు. లేకుంటే రాబోయే కాలంలో ప్రజలే ఓటుతో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్, నాయకులు హేమంత్, విష్ణు, కళ్యాణ్‌రామ్, నవీన్, విక్రమ్, రాజ్‌కుమార్, నితీష్, పవన్‌కళ్యాణ్, వినరు తదితరులు పాల్గొన్నారు.