Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతులను తప్పుదోవ పట్టిస్తోన్న బీజేపీ
సత్తా ఉంటే కేంద్రం ధాన్యం కొనుగోలు
చేసేందుకు ఒప్పించాలి
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి
ఎర్రబెల్లి దయాకర్‌రావు
టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు..
నవతెలంగాణ-విలేకరులు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన హనుమకొండ జయశంకర్ స్మృతీ వనం ఎదుట పశ్మిమ ఎమ్మెల్యే దాస్యం వినరుభాస్కర్ ఆధ్వరంయలో, వర్థన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో, రాయపర్తి మండలంలోని జాతీయ రహదారిపైన టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
వర్థన్నపేటలో : మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ..బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంపై కక్ష్యాపూరితంగా వ్యవహారిస్తోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలతో కలిసి వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే విధంగా రైతు వ్యతిరేక చట్టాలను అమలులోకి తీసుకువస్తుందని విమర్శించారు. రాష్ట్రంలోని బీజేపీ నాయకులు రోజుకో మాట, పూటకో మాట మాట్లాడుతూ రైతులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దొంగ, దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా వాళ్ళే రోడ్లపైకి వచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నాలు చేయడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ బీజేపీ నాయకులకు సత్తా ఉంటే కేంద్రాన్ని ధాన్యం కొనుగోలు చేసే విధంగా ఒప్పించాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు, పార్టీ శ్రేణులు నినాదాలతో హౌరెత్తించారు. వర్దన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు ఆయనతో పాటు రాష్ట్ర రైతు బందు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మర్నేని రవీందర్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ : హనుమకొండలో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు శుక్రవారం ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినరు భాస్కర్ ఆధ్వర్యంలో జయశంకర్ స్మృతి వనం ఎదుట భారీ స్థాయిలో ధర్నా నిర్వహించారు. ముందుగా హనుమకొండ చౌరస్తా నుంచి బాల సముద్రం లోని ఏకశిలా పార్క్ వరకు ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఎర్రబెల్లి మాటాడారు. కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితం మూడు నల్ల చట్టాలను తీసుకు వచ్చి రైతుల పొట్ట కొట్టే ప్రయత్నం చేసిందని ఆ చట్టాల వివరాలు పూర్తిగా రైతులకు తెలిస్తే, బీజేపీ నేతలను ఉరికిచ్చి, ఉరికిచ్చి కొడతారని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ చీప్ విప్ వినరు భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజను కొనే వరకు పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ ధర్నాలో మేయర్ గుండు సుధారాణి, కుడా ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి, రైతు సమితి జిల్లా కోఆర్డినేటర్ లలితా యాదవ్, రైతు విమోచన సమితి అధ్యక్షుడు నాగుర్ల వెంకన్న, గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్, వికలాంగుల కమిటీ చైర్మన్ వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాయపర్తి : కర్షకులను కేంద్ర ప్రభుత్వం నల్లచట్టాలతో కన్నీరు పెట్టిస్తోందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ రహదారిపై శాంతి యుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి బూటకపు మాటలు తప్ప ప్రజాస్వామ్య పాలన కాదు అన్నారు. దేశంలోనే అధికంగా వరి పంటను సాగు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి కేంద్రం ఉవ్విళ్ళూరుతుందని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటిసి రంగు కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహా నాయక్, జిల్లా నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి, రైబస మండల అధ్యక్షుడు సురేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.