Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
కమ్ముకొస్తున్న మబ్బులు రైతుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఏ క్షణంలో వరుణుడు ప్రతాపాన్ని చూపుతాడోనన్న బెంగతో రైతాంగం టెన్షన్ పడుతోంది. గురు, శుక్రవారాల్లో పొద్దస్తమానం వాతావరణం మారిపోయింది. ఈ సమయంలో కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం, కోతకు సిద్ధంగా ఉన్న పొలాలు ఏమవుతాయోనని కర్షకులు ఆందోళన చెందుతున్నారు. 15 రోజుల క్రితమే వరి కోతలు మొదలైనా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రారంభం కాని కొనుగోళ్లు
డివిజన్లోని తొర్రూరు, పెద్దవంగర మండలాల్లో 35 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. వానకాలం గతంలో ఎన్నడూ లేనివిధంగా సన్న రకాలే కాకుండా దొడ్డు రకం కూడా పెద్ద మొత్తంలోనే సాగు చేశారు. 15 రోజులుగా వరి కోతలు ప్రారంభమై కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి రైతులు పడిగాపులు కాస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అమ్మపురంలో తప్ప ఏ ఒక్క సెంటర్ను ఇప్పటివరకు ప్రారంభించలేదు. ఒక గింజను కూడా కొనుగోలు చేసిన దాఖలాలు లేవు.
ఎక్కడ చూసినా ధాన్యం రాసులే
పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, పెద్దవంగర మండలాల పరిధిలో ఇప్పటివరకు 50 శాతానికిపైగా కోతలు పూర్తయినట్లు సమాచారం. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్న రైతులు కాంటాలు కాకపోవడంతో ఎక్కడి ధాన్యం అక్కడే ఉండిపోయింది. మరో రెండ్రోజుల్లో కాంటాలు కాకపోతే చాలా సెంటర్లలో ధాన్యం పోసేందుకు కూడా స్థలం కరువయ్యే పరిస్థితి నెలకొంది.
వాతావరణంలో మార్పుతో రైతుల్లో టెన్షన్
ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఎక్కడ పాడైపోతుందోనన్న ఆందోళన రైతాంగంలో నెలకొంది. తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు రైతాంగాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రధానంగా గురువారం తెల్లవారుజాము నుంచి చల్లటి గాలులతో ఆకాశం మేఘావతమై ఉండడం రైతులను మరింత కలవర పెడుతోంది. ఏ మాత్రం వర్షం కురిసినా నోటి కాడికి వచ్చిన ఈ వరి పైరు నేలకొరిగి రైతాంగానికి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం రాసులు తడిసిపోతాయని ఆందోళన చెందుతున్నారు. తడవకుండా రైతులు ఉరుకులు పరుగులతో పట్టాలు కప్పి ఉంచారు.
ధాన్యం తెచ్చి 20 రోజులైంది : సరోజన, రైతు, వెలికట్టె
నాలుగెకరాల్లో వరి కోసి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చి 20 రోజులు అయింది. ఇంతవరకు కాంటా ప్రారంభించలేదు. వర్షాలు కురుస్తాయేమోనని భయంగా ఉంది. అధికారులు చర్యలు తీసుకోవాలి.
తెల్లందాకా కాపలా.. : కొమ్ము రామచంద్రు, రైతు, వెలికట్టె
కాంటాలు ప్రారంభిస్తారని కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చి ఇరవై రోజులు అయింది. ఇంతవరకూ కాంటాలు ప్రారంభించలేదు. వడ్ల కు కాపలా ఉండలేక తెల్లందాకా కంటి మీద కునుకు ఉండడంలేదు.
నెల రోజులైనా కాంటా ప్రారంభించలేదు : ఎ కొమురయ్య, రైతు వెలికట్టె
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు అవుతుంది. శుక్రవారం కురిసిన వర్షాలకు ధాన్యం తడిసింది. పరదాలు కిరాయికి తెచ్చుకున్నాము. 200 బస్తాల ధాన్యం రాసులు పోసి పరదాలు కప్పి ఉంచాము. ఒక పరదాకు రోజుకు రూ.30లు చొప్పున 30 పరదాలకు రోజుకు రూ.900లు చెల్లిస్తున్నా. కిరాయి కట్టలేకపోతున్నాము. వెంటనే కొనుగోళ్లు చేపట్టాలి.