Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అప్పుల ఊబిలో పలువురు కాంట్రాక్టర్లు
కమిషన్ ఇవ్వనిదే బిల్లుల మంజూరు చేయబోరని ఆరోపణలు
బిల్లులు ఇవ్వాలని వేడుకోలు..
నవతెలంగాణ-పోచమ్మమైదాన్
వరంగల్ మహానగర పాలక సంస్థలో అభివద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు నెలలు గడిచినా బిల్లులు రావట్లేదు. బల్దియా పరిధిలో పలు రకాల అభివద్ధి పనులను కొంతమంది కాంట్రాక్టర్లు పూర్తి చేశారు. బల్దియా ఇంజినీరింగ్ అధికారులు కమీషన్లు ఇవ్వనిదే బిల్లులు చెల్లించబోమని అంటున్నారని, ఈ క్రమంలో బిల్లులు చెల్లింపులో కాలయాపన చేస్తున్నారని పలువురు కాంట్రాక్టర్లు ఆరోపణలు చేస్తున్నారు. స్మార్ట్ సిటీ, మిషన్ భగీరథ వంటి పనులను చేస్తున్న బడా కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు ఇస్తున్నారని, చిన్న, చిన్న పనులు చేస్తున్న తమకు మాత్రం ఏదో ఒక సాకుతో అధికారులు బిల్లులు ఇవ్వకుండా దాటవేస్తున్నారని పలువురు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్పొరేషన్లో నిర్వహించిన అభివృద్ధి పనులకు అధికారులు కమిషన్లు తీసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. బిల్లుల మంజూరులో కమీషన్ల పేరుతో అసిస్టెంట్ ఇంజనీర్ 2శాతం, డీఈ 2శాతం, ఈఈ ఒక్కశాతం, ఆడిట్‌కు అరశాతం, ప్రొఫార్మా రాసిన అకౌంటెంట్‌కు ఒక్క శాతం, డీబి సెక్షన్‌కు అరశాతం కమిషన్ వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద అధికారులకు సుమారు ఏడు శాతం, ఇతర ఖర్చులకు మూడుశాతం కలిసి పదిశాతం వరకు చిల్లు పడుతోందని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. బిల్లు రావడానికి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామని, నెలలు గడిచినా బిల్లులు రాకపోవడంతో అప్పులు తెచ్చి అభివద్ధి పనులు చేసి తిప్పలు పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కమిషనర్, మేయర్ పట్టించుకుని పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.