Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి విక్రమ్ రెడ్డి
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
రానున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యులు బరిలో ఉంటారని ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ముద్దం విక్రమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం డివిజన్ కేంద్రంలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి విక్రమ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం విధులు, నిధులు, అధికారాలను అప్పగించకపోవడంతో ఎన్నికవుతున్న మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ఎంపీటీసీ) సభ్యులు ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నారని అన్నారు. కేవలం ఎంపీటీసీ సభ్యులే గ్రామాల్లో అభివద్ధి కార్యక్రమాలు చేపట్టేలా రాష్ట్ర బడ్జెట్లో రూ.500 కోట్లను కేటాయిస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని అన్నారు. అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదన్నారు. ప్రాదేశిక స్థానాల ఎన్నికలకు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు అధికారాలు, విధులు, నిధులు కేటాయించ కపోవడం దారుణమన్నారు. ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికై.. పదవిని చేపట్టినా ఇప్పటి వరకు నిధులు, విధులు లేవని అన్నారు. గ్రామ పంచాయతీలో కనీసం ప్రత్యేక కుర్చీ కూడా లేదని, ప్రజా ప్రతినిధులు, అధికారులు సైతం ప్రోటోకాల్ పాటించడం లేదని అన్నారు. ఉపసర్పంచ్‌లకు కూడా చెక్ పవర్ కల్పించారని, ఎంపీటీసీలను మాత్రం ఉత్సవ విగ్రహాలుగానే మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిషత్ అభివృద్ధికి గతంలో బీఆర్ఆర్పీఎఫ్ నిధులు, స్టేట్ ఫైనాన్స్ నుంచి నిధులు వచ్చేవని, అవి ప్రస్తుతం రావడం లేదన్నారు. ఆర్థిక సంఘం నిధులు ఎంపీటీసీలకు సంబంధం లేకుండా నేరుగా గ్రామాలకు మంజూరు చేస్తుండటంతో గౌరవ సభ్యులకు గౌరవం లేకుండా పోతుందని అన్నారు. ఆర్థిక సంఘం నిధులు 10 శాతం నుంచి 25 శాతం వరకు ఎంపీటీసీ లకు ఇవ్వాల్సిందిగా కేంద్రం సూచించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 10 శాతానికి మాత్రమే పరిమితం చేసిందన్నారు. 25 శాతానికి పెంచాలన్న ఎంపీటీసీల విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆర్టికల్ 243 లోని పదకొండవ షెడ్యూల్ ప్రకారం నిధులు, విధులు అధికారాలు వెంటనే బదలాయించాలని అన్నారు. గౌరవ వేతనాన్ని రూ.15 వేలకు పెంచాలని, మైనింగ్ రాయల్టీ, సీవరేజీ, డి ఎం ఎఫ్ టి ద్వారా సమకూరే ఆదాయాన్ని ఎంపిటిసి లకు ఇవ్వాలని, ఇసుక మైనింగ్ ఎంపీటీసీల పర్యవేక్షణలో జరగాలని అన్నారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్, అగ్రికల్చర్, మార్కెటింగ్, మండల ల్యాండ్ అసైన్మెంట్ కమిటీ లు, జిల్లా ప్రణాళికా సంఘాల్లో ఎంపీటీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ప్రాదేశిక సభ్యులకు పాలనలో అధికారాలు, బాధ్యతలు, విధులు కట్టబెట్టాలన్నారు. ఎంపీటీసీ సభ్యుల పట్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి ఎంపీటీసీలు దిగుతున్నట్లు తెలిపారు.