Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తొర్రూరు కోర్టు న్యాయమూర్తి రాజ్‌కుమార్
నవతెలంగాణ-తొర్రూరు
బాలికల సంరక్షణకు పోక్సో కోర్టులు ఏర్పడ్డాయని తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి రాజ్‌కుమార్ అన్నారు. ఆదివారం డివిజన్ కేంద్రంలోని సంక్షేమ బాలికల గురుకులంలో న్యాయ చైతన్య అవగాహన కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి ఆయన పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జి. జయశ్రీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాజ్ కుమార్ మాట్లాడారు. బాలికలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ బాల్య వివాహాలు జరగడం బాధాకరమన్నారు. బాలికలు విద్య ద్వారానే అన్ని రంగాల్లో అభివద్ధి సాధిస్తారని అన్నారు. దేశానికి క్రీడల్లో అధికంగా పతకాలు తీసుకొచ్చిన ఘనత ఆడబిడ్డలేదేనని అన్నారు. బాలికల విద్య, వైద్యం, పౌష్టికాహారంతో పాటు సామాజిక ఎదుగుదలకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అనంతరం వక్తృత్వ, నృత్యం, పాటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వల్లపు మహేష్, న్యాయవాదులు వెంకన్న, రఘురాం రెడ్డి, అశోక్ , నాగేశ్వర్, భాస్కర్, యాకాంబ్రం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.