Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'సిరికొండ'కు డౌట్..?
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేల కోటాలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీఆర్ఎస్ పార్టీ మాజీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు అభ్యర్థిత్వాలకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ప్రగతిభవన్ వర్గాలు ఆ ఇద్దరికీ తెలిపినట్టు సమాచారం. ఇదిలా ఉంటే మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి ఎక్కడ అవకాశం కల్పిస్తారనే విషయంలో సందేహాలు వ్యక్తమౌతున్నాయి. 'సిరికొండ'ను రాజ్యసభ సభ్యుడిగా పంపే అవకాశముందని పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేల కోటాలో ఆరుగురికి, గవర్నర్ కోటాలో ఒక్కరికి ఎమ్మెల్సీ ఇవ్వడానికి నాయకత్వం అభ్యర్థులను ఖరారు చేయడానికి తీవ్రంగా కసరత్తు చేస్తోంది. కడియం, తక్కళ్లపల్లితోపాటు మాజీ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ సీతారాంనాయక్, గుడిమల్ల రవికుమార్, తదితరులు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్సీ పదవులను ఆశించారు. ఈసారి ఉద్యమ నేతలకు అవకాశం వస్తుందని ఆశించినా కడియం శ్రీహరికి మరోమారు అవకాశం ఇవ్వడంతో ఉద్యమకారులకు అవకాశం దక్కలేదు. ముందు నుంచి అనుకున్నట్టే శ్రీహరికి ఎమ్మెల్సీ బెర్త్ ఖాయమైంది. ఈసారి తక్కళ్లపల్లి రవీందర్‌రావుకు అవకాశం దక్కడం గమనార్హం. ఏది ఏమైనా ఇప్పటివరకు ఎమ్మెల్సీ పదవులపై ఆశలు పెట్టుకున్న ఉద్యమకారులకు మళ్లీ నిరాశే మిగిలింది.