Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సింహులపేట
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల వేదన అరణ్యరోదనగా మారిందన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. కీలకమైన సబ్జెక్టులకు ఉపాధ్యాయుల కొరత ఉందని, నేటికీ పుస్తకాలు తెరవని దారుణం నెలకొందని తెలుస్తోంది. ఇక టెన్త్ విద్యార్థుల్లో అయోమయం నెలకొనగా విద్యావాలంటీర్లు సైతం లేని దుస్థితి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో 'నవతెలంగాణ' ప్రత్యేక కథనం..
గతేడాది కరోనా వల్ల విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు వెళ్లిన విషయం తెలిసిందే. కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది సెప్టెంబర్ 1న ప్రస్తుత విద్యాసంవత్సరం మొదలై పాఠశాలలు తెరుచుకున్నాయి. మండలంలో 34 ప్రాథమిక, 10 ప్రాథమికోన్నత, రెండు ప్రభుత్వ హైస్కూళ్లు ఉన్నాయి. సుమారు 3 వేల మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. మొత్తం 173 మంది ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా కేవలం 96 మందితో నెట్టుకొస్తున్నారు. మొత్తం 77 ఉపాధ్యాయ ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. మండలంలోని రెండు హైస్కూళ్లకూ గెజిటెడ్ హెచ్ఎంలు లేకపోవడం గమనార్హం. మండల కేంద్రంలోని పాఠశాలలో సోషల్ స్టడీస్, హిందీ, తెలుగు, బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయుల కొరత ఉంది. ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది.
ఇంకా పుస్తకాలు తెరువులే..
మండలంలోని 44 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా సగానికిపైగా పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ల కొరత వెంటాడుతోంది. మూడేండ్లుగా మండలంలోని పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. 2019-20 విద్యా సంవత్సరంలో విద్యావాలంటీర్లు పాఠ్యాంశాలు బోధించారు. 2020-21లో ఆన్లైన్ విద్యాబోధన సాగింది. ప్రస్తుత విద్యాసంవత్సరం మొదలై మూడు నెలలు గడుస్తున్నా విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన ప్రారంభమే కాలేదు. ఉపాధ్యాయులు లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. ఏటా ప్రభుత్వం విద్యావాలంటీర్లను నియమిస్తుండగా ఈ ఏడాది ఆ పరిస్థితి కూడా లేదు.
అయోమయంలో విద్యార్థులు..
ఏటా మార్చిలో టెన్త్ విద్యార్థులకు వార్షిక పరీక్షలుంటాయి. డిసెంబర్ నాటికి విద్యార్థులకు సిలబస్ పూర్తి చేసి జనవరి నుంచి రివిజన్, స్టడీ అవర్స్ నిర్వహించడం ఆనవాయితీ. కాగా ఈ ఏడాది ఇప్పటివరకు కొన్ని పాఠశాలల్లో ఇంకా విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన మొదలవలేదు. పాటలు చెప్పకుండా పరీక్షకు ఎలా సిద్ధం కావాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురౌతున్నారు.
కొన్ని పాఠశాలల్లో ఇలా..
మండలంలోని కొమ్ములవంచ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 174 మంది విద్యార్థులు ఉండగా సైన్స్, సోషల్ స్టడీస్‌కు ఉపాధ్యాయులు లేరు. అలాగే జయపురంలో 157 మంది విద్యార్థులుండగా బయో సైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు ఉపాధ్యాయులు మూడేండ్లుగా లేరు. ఇక బొజ్జన్నపేట ప్రాథమిక పాఠశాలలో 75 మంది విద్యార్థులుండగా కేవలం ఒక ఉపాధ్యాయురాలితో నెట్టుకొస్తునానరు. అన్ని తరగతులకూ బోధించడంలో ఆమె సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే రామన్నగూడెం, ముంగిమడుగు, పకీరాతండా గ్రామాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది.
ఉపాధ్యాయులను త్వరగా నియమించాలి
పూర్ణచందర్, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు
ప్రభుత్వ పాఠశాలల్లోని ఖాళీల్లో ఉపాధ్యాయులను నియమించాలి. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించడంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి. కనీసం విద్యా వాలంటీర్లనైనా నియమించాలి.
ఏటా ఇదే సమస్య : వెంకట్‌రెడ్డి, నోడల్ హెచ్ఎం
మా పాఠశాలలో ఏటా ఉపాధ్యాయుల కొరత ఉంటోంది. విద్యా శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి తక్షణమే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవు.
సర్దుబాటు చేస్తున్నాం : సోమశేఖర శర్మ, డీఈఓ
విద్యార్థుల సంఖ్య పెరిగిన క్రమంలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నాం. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలల్లో విద్యాబోధన సజావుగా సాగేలా చొరవ తీసుకుంటాం. ప్రస్తుతం ఉపా ధ్యాయ ఖాళీల వల్ల సమస్య ఎదురౌతోంది. విద్యావాలంటీర్ల ను సైతం ప్రభుత్వం ఈ ఏడాది నియమించలేదు. ఈ విషయంలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం.