Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య, ఆమె సహచరుడు రామకృష్ణారెడ్డిపై బనాయించిన అక్రమ కేసును తక్షణమే ఎత్తివేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి గౌని ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో ఏఐకేఎంఎస్, ఐఎఫ్టీయూ, పీవైఎల్, పీడీఎస్యూ, తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరస తెలిపారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడారు. ఇటీవల మావోయిస్టు నేత రామకష్ణ మరణింగా ఆయన జ్ఞాపకాలను ఆయన భార్య, ఇతరులు రాసిన, ఇప్పటికే పత్రికల్లో అచ్చయిన వాటిని పుస్తకంగా ముద్రించటం నేరమెలా అవుతుందని ప్రశ్నించారు. పుస్తకం నిషేదితం కాదని, అక్షరంపై ఆంక్షలు చెల్లుబాటు కావని స్పష్టం చేశారు. ప్రజల అభిమానం పొందిన వారి జీవిత చరిత్ర తెలుసుకోవడం నేరం కాదని తెలిపారు. కొడుకును, సహచరుని ప్రజలకు అంకితమిచ్చిన శిరీష బాధను, ఉద్వేదనను ప్రజలతో పంచుకోవడం, అక్షరబద్ధం చేయడం నేరమా? అందుకు సహకరించడం నేరమా? పాలకులు ప్రమాణం చేసిన రాజ్యాంగములో ఇది నేరమని ఉన్నదా! ప్రింటర్స్ నేరస్తులు కాదు. భావం నేరం కాదు. నిర్బంధాలు, చెల్లుబాటు కాలేవు. ఈ కేసును ఎత్తివేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని అన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రగతి శీల మహిళా సంఘం నాయకురాలిగా సుపరిచితమైన సంధ్య మావోయిస్టు ఎలా అవుతుందన్నారు. అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు సనప పొమ్మయ్య, మండల కార్యదర్శి బానోత్ నర్సింహ, ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి మాదంశెట్టి నాగేశ్వర్రావు, పీవైఎల్ రాష్ట్ర నాయకులు తుడుం వీరభద్రం, పీడీఎస్యూ రాష్ట్ర నాయకుడు బోనగిరి మధు, జిల్లా నాయకుడు బానోత్ దేవేందర్, మాజీ సొసైటీ చైర్మెన్ రామగిరి భిక్షం తదితరులు పాల్గొన్నారు.