Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరంగల్ నగరంలోని ఎల్బీనగర్ ప్రాంతంలోని భార్గవి బార్‌పై పట్టపగలు 30 మంది వ్యక్తులు యజమానిని కులం పేరుతో దూషిస్తూ సిబ్బందిపై దాడి చేసి బార్‌కు తాళం వేసిన వైనమిది. 100కు డయల్ చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నాం 1.00 గంటలకు జరిగింది. అనిల్‌కుమార్ అనే వ్యక్తి తన 30 మంది సహచరులతో వచ్చి మద్యం సేవించి రూ.12 వేలకుపైగా బిల్లు చేసి తనను తిడుతూ సిబ్బందిపై రౌడీమూకలు దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆ బార్ యజమని గుగులోతు తిరుపతి 'నవతెలంగాణ'కు తెలిపారు. ఈ ఘటన వెనుక పోలీసు పెద్దలతోపాటు మరికొంత మంది పెద్దలున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ బార్‌కు సంబంధించి గతేడాదిగా యాజమాన్యంలో భాగస్వాముల మధ్య ఆర్ధిక లావాదేవీలపై గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో ప్రముఖ మద్యం వ్యాపారి వద్ద పెద్దమనుష్యులతో పంచాయితీ జరిగింది. ఎవరు ఎవరికి ఎంతివ్వాలో తేల్చినా, పోలీసు అధికారులు, సంఘంలో పెద్దమనిషిగా చెలామణి అవుతున్న మరో పెద్ద మనిషి ఈ వ్యవహారంలో తలదూర్చి రౌడీలతో యాజమాన్యంపై దాడి చేయించారు. అనిల్‌కుమార్ తన బావ రవికిరణ్‌పై తిరుపతి కేసు పెట్టిన నేపథ్యంలో తన గ్యాంగ్ 30మందితో వచ్చి తిరుపతిని కులం పేరిట దూషిస్తూ సిబ్బందిని కొట్టి మరీ బార్‌కు తాళం వేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై బార్ యజమాని గుగులోతు తిరుపతి 100కు డయల్ చేసి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం గమనార్హం. శాంతిభద్రతల సమస్యలో న్యాయం చేయాల్సిన పోలీసు అధికారి సైతం రౌడీలకు వెన్నుదన్నుగా వుండడం పట్ల యాజమాన్యం తీవ్ర ఆందోళనకు గురవుతుంది. అనిల్‌కు వెన్నుదన్నుగా ఒక పెద్ద మనిషితోపాటు పోలీసు అధికారి వున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
అసలేం జరిగింది..?
గుగులోతు తిరుపతి, కోలా రవికిరణ్ నుంచి 2017లో రూ.5.10కోట్లకు భార్గవి బార్‌ను (జీ+3 బార్ అండ్ రెస్టారెంట్, లైసెన్స్, స్థలం) కొనుగోలు చేశాడు. ఈ డబ్బులు తీసుకున్నాక రవికిరణ్ తిరుపతికి రిజిష్టర్ చేయకుండా ఉడాయించాడు. ఈ విషయమై ఇంతేజార్గంజ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా రవికిరణ్, అతని సతీమణిపై ఎస్సీ, ఎస్టీ (ఎఫ్ఐఆర్ నెంబర్ 229/2021, 26.07.2021) కేసు నమోదైంది. ఈ క్రమంలో రవికిరణ్ బావమరిది పెరుమాండ్ల అనిల్‌కుమార్ చాలా రోజులుగా తనను వెంబడిస్తున్నట్లు తిరుపతి చెబుతున్నాడు. అనిల్ విషయంలో అనుమానముండడంతో పోలీసులకు సైతం ఫిర్యాదు చేశానని, పోలీసులు పట్టించుకోకపోవడంతో సోమవారం మధ్యాహ్నాం దాడికి తెగబడ్డారన్నారు. నేరుగా బార్లోకి వచ్చి కౌంటర్లో వున్న వ్యక్తితోపాటు నన్ను గల్లా పట్టి నెట్టేశారని, అనంతరం మిగతా గుర్తుతెలియని వ్యక్తులు తనను చుట్టుముట్టి బయటకు నెట్టేయడంతో రోడ్డున పడినట్లు పేర్కొన్నారు. కులం పేరుతో దూషిస్తూ నా బావపై కేసు పెడుతావా ? లంబాడోడా నీకు బార్ అవసరమా ? అంటూ పరుషపదజాలంతో దూషిస్తూ నన్ను కొట్టి బార్ షట్టర్ మూసేసి తాళం వేసినట్టు తెలిపారు. 100కు డయల్ చేసినా పోలీసులు రాలేదని వాపోయారు.
'బార్'లో భాగస్వామ్యం కోసం ..
ఈ బార్లో భాగస్వామ్యం తీసుకోవాలని ఆశపడుతున్న మరో పెద్ద మనిషి పోలీసు అధికారితో కుమ్మక్కై ఈ వ్యవహారం పరిష్కారం కాకుండా వివాదాస్పదంగా మారేలా చేశారని పలువురు భాగస్వాములు 'నవతెలంగాణ'కు తెలిపారు. పలుమార్లు పంచాయతీ చేసి ఎవరికి ఎంత చెల్లించాలో తేల్చాక సైతం ఉద్దేశపూర్వకంగానే వివాదాన్ని పరిష్కారం కాకుండా చేయడం పట్ల ఇప్పటికే కోర్టునాశ్రయించినట్లు చెప్పారు. కోర్టులో సమస్య వున్న నేపథ్యంలో పోలీసు అధికారి, మరో పెద్ద మనిషి బార్ యాజమాన్యంలోని ప్రధాన భాగస్వాములను బెదిరింపులకు గురిచేయడం గమనార్హం.