Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో వరంగల్
కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-హన్మకొండ
రైతు పండించే ప్రతి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సోమవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట ఏఐకేఎస్ఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్ మంత్రులు రైతుల పంట కొనుగోలుపై ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ మోసగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్తో పాటు పలువురు మంత్రులు పంటలపై ఆంక్షలు విధిస్తూ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని వాపోయారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయమని ఎఫ్సీఐ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ పంపిందని, నిజానికి వచ్చే యాసంగి పంట మొత్తం కొనుగోలు చేయకుండా ఉండటమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని వారు విమర్శించారు. భారత్ డబ్య్లూటీఓలో చేరినప్పటి నుంచి గతేడాది ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాల వరకు రైతాంగానిఇక అధోగతికి చేర్చిన ఘనత పాలక పార్టీలకే దక్కుతుందన్నారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల బహుళజాతి సామ్రాజ్యవాద, కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల దేశ రైతాంగం ఏ పంట వేయాలో అర్థంకానీ పరిస్థితుల్లో ఉందని తెలిపారు. రైతులు పండించిన పంటలకు కనీస పెట్టుబడి రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వాపోయారు. రైతులు వరి సాగు చేయొద్దని చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని, పంటకు మద్దతు ధర ప్రకటించి మొత్తం పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆబర్ల రాజన్న, మొగిలి ప్రతాపరెడ్డి, జిల్లా నాయకులు రాచర్ల బాలరాజు, గట్టి కష్ణ, తిరుపతి, ప్రజాసంఘాల నాయకులు ఎలకంటి రాజేందర్, భాషిపాక అశోక్, సుమన్, సంపత్, కానుగుల రంజిత్, బండి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.