Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పవర్ లేని పదవులు ?
అ ఉత్సవ విగ్రహలుగా ఎంపీటీసీలు
నవతెలంగాణ-మల్హర్రావు
గెలిచి రెండేండ్లు దాటినా... ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. సర్పంచ్ ల మాదిరిగానే తాము ప్రజల ఓట్లతోనే ఎన్నికయ్యామని, ప్రత్యేక నిధులు, విధులు లేవని, గ్రామపంచాయతీలో కూర్చుందామంటే కనీసం కుర్చీ కూడా ఉండట్లేదని, గ్రామాల్లో చిన్న పనులు కూడా చేయలేకపోతున్నామని ఎంపీటీసీలు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు.
మండలంలో 2019 జూన్ 4న ఎంపీటీసీల ఫలితాలు వెలువడ్డాయి. నెల తరువాత జులై 3న ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీటీసీల పదవి కాలం ఇప్పటికే రెండేండ్లు గడిచింది. మండల వ్యాప్తంగా ఏడుగురు ఎంపీటీసీలు ఉన్నారు. ఇందులో టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 4, ఒక్కరు ఇండిపెండెంట్‌గా గెలు పొందారు. అయితే సింహభాగం కాంగ్రెస్ ఎంపీటీసీలు గెలుపొందారు. ప్రభుత్వం మాత్రం ప్రత్యేక నిధులు కేటాయించిన దాఖలాల్లేవు. మండల పరిషత్ లకు గతంలో బీఆర్ జిఏప్ తలసరి గ్రాంట్, జనరల్ పండ్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, 14వ ఆర్థిక సంఘం గ్రాంట్ లతో కలిసి నిధులు సమకూరేవి. దీంతో గ్రామాల్లో డ్రైనేజీలు, సీసీరోడ్లు,అంతర్గత రోడ్లు నిర్మాణ పనులు చేపట్టేవారు .ప్రస్తుతం నిధులు ఎంపిటిసిల ప్రమేయం లేకుండా నేరుగా గ్రామాలకు ఇస్తుండటంతో ఎంపీటీసీలకు గౌరవం లేకుండాపోయింది. 15 వ ఆర్థిక సంఘం నిధుల్లో 10 నుంచి 20 శాతం ఇవ్వాలసిందిగా కేంద్రం సూచించినప్పటికి రాష్ట్రం పది శాతానికి పరిమితం చేసింది. దీనిని 25 శాతానికి పెంచాలన్న ఎంపీటీసీల విజ్ఞప్తి ని పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఒక్కదానికి కూడా నిధులు రాని పరిస్థితి నెలకొంది. వీరికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటన చేసినా నేటికి నిధులు విడుదల చేయలేదు. సర్పంచ్ లతో సమానంగా నిధులు కేటాయించాలని పలుమార్లు మండల సర్వసభ్య సమావేశాల్లో కోరిన పట్టించుకునేవారు కరువైయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిధుల కోసం వినతులు....
ఎంపిటిసిలకు ప్రత్యేక నిధులు కేటాయింపుతోపాటు గ్రామపంచాయతీల్లో ప్రత్యేక గది, సర్పంచ్‌లకు కేటాయిస్తున్నట్లుగానే సాధారణ నిధులు కేటాయించాలని కోరుతూ అధికార పార్టీ ఎంపీటీసీలు ఇటీవల రాష్ట్ర ప్రణాలిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్ ,ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్ రావుకు వినతిపత్రం సమర్పించారు. నిధుల కేటాయింపు విషయంలో అధికార పార్టీలో ఉండి వినతిపత్రాలు ఇచ్చే దుస్థితి రావడం బాధాకరమని అధికార ఎంపీటీసీ సభ్యులే వాపోయిన సందర్భాలున్నాయి. ఇప్పటికైనా ఎంపీటీసలకు పలు అధికారాలివ్వాలని కోరుతున్నారు.