Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏఐకేఎఫ్ జాతీయ కార్యదర్శి మోర్తాల..
నవతెలంగాణ-కాశిబుగ్గ
మద్దతు ధరతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం తమ బాధ్యత లను విస్మరించి రైతులను వంచిస్తున్నారని అఖిల భారత కిసాన్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి మోర్తాల చందర్ రావు మండిపడ్డారు. నగరంలోని అబ్బనికుంట తెలంగాణ రైతు భవన్లో మంగళవారం జరిగిన వరంగల్ ఉమ్మడి జిల్లా సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీలు వరి వేస్తే ఉరేనని ఒకరు, ధాన్యం కొనుగోలు బాధ్యత మీదేనని మరొకరు ఆరోపణలు చేసుకుంటూ రైతులను నష్టాలకు గురి చేస్తున్నారని మండిపడ్డార్ను. రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించి అమలు పరచాలన్నారు. రైతు వ్యతిరేక సాగు చట్టాలను, విద్యుత్ సవరణ చట్టాలను రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. వరి పంట కన్న అధిక లాభాలు వచ్చే విధంగా ఇతర పంటల వైపు రైతులను మళ్ళించేందుకు, లాభసాటి ధరలతో ప్రభుత్వమే ఆ పంటలను కొనుగోలు చేసే విధంగా రైతులతో ఒప్పందం చేసుకోవాలన్నారు. తక్షణమే అన్ని ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వరి ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భాషిపాక సదానందం, వారికెలా కిషన్‌రావు, కార్యదర్శి గోనె కుమారస్వామి, కోశాధికారి కూససంపత్ కుమార్, నాయకులు నర్సయ్య, సమ్మయ్య, శ్రీనివాస్, ఆనందరావు, రాజు, కొమురయ్య, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.