Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యానికి కుట్రలు..
సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కార్యదర్శి సీహెచ్ రంగయ్య
నవతెలంగాణ-చెన్నారావుపేట
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బడా పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేట్లకు కొమ్ముకాస్తోందని సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కార్యదర్శి సీహెచ్ రంగయ్య విమర్శించారు. ఉప్పరపల్లిలో మంగళవారం నిర్వహించిన సీపీఐ(ఎం) మండల మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. అందులో భాగంగానే ఎల్ఐసీ, రైల్వే, తదితర సంస్థలను ప్రయివేటికరించడానికి పూనుకుంటున్నట్టు మండిపడ్డారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని తుంగలో తొక్కాడన్నారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం జరుగుతోందన్నారు. అందులో భాగంగానే రైతుల ధాన్యం కొనుగోలులో మీనమేషాలు లెక్కిస్తున్నారని ఏద్దేవాచేశారు. రైతుల వరి ధాన్యం కొనకుండా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒకరిపై, మరొకరు ఆరోపణలు చేసూకుంటూ దొంగనాటాకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఈ రెండు పార్టీలను అన్ని వర్గాల ప్రజలు గమనిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో వీరికీ ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై కార్యకర్తలు జన సమీకరణ చేసి పోరాటాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభలో జిల్లా కమిటీ సభ్యులు ఈసంపల్లి బాబు, హనుమకొండ శ్రీధర్, మండల కార్యదర్శి నవీండ్ల స్వామి, పరికి మధుకర్, శారద, ఐలయ్య, సతీష్, స్వామి, నరేష్, భూపాల్ రెడ్డి, భారతక్క, లచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.