Authorization
Mon Jan 19, 2015 06:51 pm
4గంటలపాటు ఉద్రిక్తత జేసీబీ సాయంతో రక్షించిన పోలీసులు
నవతెలంగాణ శాయంపేట
యువకుడు తన బావి ఓడలు శిథిలావస్థకు చేరుకోవడంతో, వాటిని తీయడానికి యత్నిస్తుండగా ప్రమాదవశాత్తూ ఓడలు, మట్టి మధ్య ఇరుక్కుపోయిన ఘటన హనుమకొండ జిల్లా, శాయంపేట మండలం, పత్తిపాకలో మంగళవారం చోటు చేసుకుందిన వివరాల ప్రకారం.. పత్తిపాకకు చెందిన పోతుగంటి వెంకటేష్ తన ఇంటి ముందున్న మంచినీటి బావి ఓడలు శిథిలావస్థకు చేరడంతో, వాటిని తొలగించి కొత్త వాటిని వేయడానికి మంగళవారం పని మొదలుపెట్టాడు. ఓడల చుట్టూ మట్టి తొలగిస్తుండగా ఓడలు, మట్టి మధ్య ఇరుక్కుపోయాడు. అతను కేకలు వేయడంతో భార్య అనిత గమనించి చుట్టుపక్కల వారికి సమాచారం అందించింది. స్థానికుల సమాచారంతో ఎస్సై అక్కినపల్లి ప్రవీణ్ కుమార్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. రెండు జేసీబీలతో 4ఓడలను తొలగించారు. మిగిలిన ఓడలను స్థానికులు పగలగొట్టారు. స్థానికులు, పోలీసులు 4గంటల పాటు సుదీర్ఘంగా కష్టపడి వెంకటేష్‌ను సురక్షితంగా బయటికి తీశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా వెంకటేష్ బయటకి రావడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. 108వాహనంలో చికిత్స నిమిత్తం బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యల్లో స్థానిక సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి, ఎంపీటీసీ గజ్జి ఐలయ్య, ఉప సర్పంచ్ పోతుగంటి సరోజన మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.