Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు
నవతెలంగాణ-కోల్‌బెల్ట్
డిసెంబర్ 18, 19 తేదీలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించే పార్టీ జిల్ల ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బంధు సాయిలు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రం లోని పార్టీ కార్యాలయ శ్రామిక భవన్లో జిల్లా కమిటీ సభ్యులు కంపేటి రాజయ్య అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలు ఏర్పడిన తర్వాత జిల్లా కేంద్రంలో మొదటిసారిగా పార్టీ జిల్లా ద్వితీయ మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చిన తర్వాత పెట్టుబడిదారులకు అనుకూలంగా, పేద వర్గాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని ఆరోపించారు. పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తూ, పేదవర్గాల హక్కులను కాలరాస్తున్నదని మండిపడ్డారు. కార్మిక చట్టాల సవరణ ఉపసంహరించు కోవాలన్నారు. మూడు రైతు వ్యతిరేక అగ్రి చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సంస్కరణలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బొగ్గు, వ్యవసాయం, బ్యాంకులు, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రైల్వే, ఆర్టీసీ ప్రైవేటీకరణ నిలిపివేయాలన్నారు. పేదలకు కూడు, గూడు కల్పించాలని, కొత్త పరిశ్రమలు, కొత్త కొలువులు అందించా లన్నారు. ఉపాధి హామీ పనుల రోజులు పెంచి రోజు కూలీ రూ.600 ఇవ్వాలన్నారు. ప్రభుత్వాల వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ భవిష్యత్‌లో సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు వెలిశెట్టి రాజయ్య, రమేష్, పోలం రాజేందర్, సకినాల మల్లయ్య, గుర్రం దేవేందర్ పాల్గొన్నారు.
బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి : గిరిజన సంఘం
నవతెలంగాణ-జనగామ
గిరిజన శాఖ లో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షు లు లావుడియా అనిల్ చౌహాన్ డిమాండ్ చేశారు. గురువారం జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వజూనియర్ కళాశాలను తేజావత్ గణేష్ నాయక్‌తో కలిసి ఆయన సందర్శించి మాట్లాడారు. ఏడేండ్ల పాలనలో గిరిజనులకిచ్చిన హామీలనునేటికీ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో గిరిజనులు దాదాపు 30 లక్షలకు పైగా ఉన్నారని, గిరిజన బ్యాక్లాగ్ పోస్టులు దాదాపు 10వేలకు పైగా ఉన్నాయని అన్నారు. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకుటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గూగులోతు శ్రీకాంత్ నాయక్, దినేష్చౌహాన్, ప్రవీణ్‌నాయక్, ప్రియాంక, మౌనిక తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి : వామపక్షాలు
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
ధాన్యం కొనుగోలు త్వరగా ప్రారంభించాలని వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక తహసీల్ధార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి కూరపాటి విజరుకుమార్ పాల్గొని మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటను కొనడంలో పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. వాతావరణ మార్పులతో రైతులుల దిక్కుతోచని దుస్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు తోట రమేష్, ఎండీ యునాస్, తిరుపతి, రాజయ్య, నరేష్, రాజు, నర్సయ్య, సారయ్య, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.