Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఐక్యపోరాటాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసిందని సీపీఐ(ఎం) హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లా కార్యదర్శులు సారంపెల్లి వాసుదేవరెడ్డి, చింతమల్ల రంగయ్య, సాదుల శ్రీనివాస్, బందు సాయిలు, తుమ్మల వెంకట్రెడ్డి, మోకు కనకారెడ్డి స్పష్టం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకుంటామని, రానున్న పార్లమెంటరీ సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదిస్తామని ప్రధాని మోడీ ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా సీపీఐ(ఎం), సీపీఐ, న్యూడెమోక్రసీ, ప్రతిపక్ష పార్టీలు, రైతు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు మాట్లాడారు. ఏడాది పాటు అనేక కష్టనష్టాలకోర్చి సుదీర్ఘ పోరాటం సాగించిన ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు ఐక్యపోరాటాలే శరణ్యమని స్పష్టం చేశారు. ఢిల్లీ రైతుల, రైతు వ్యతిరేక చట్టాల వ్యతిరేక పోరాట స్ఫూర్తితో పాలకుల తప్పుడు విధానాలపై అన్ని తరగతుల ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ హామీ ఇచ్చిన మేరకు రానున్న శీతాకాల పార్లమెంటరీ సమావేశంలో బిల్లు పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు.