Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమీషనర్ ప్రావీణ్య
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
సానిటేషన్, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని కమీషనర్ ప్రావీణ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం వరల్డ్ టాయిలెట్స్ డే ను పురస్కరించుకుని మరుగుదొడ్ల ఆవశ్యకతను తెలుపుతూ బల్దియా అధికారులు, సిబ్బంది కాకతీయ మెడికల్ కళాశాల నుంచి సెంట్రల్ జైలు, ఎంజీఎం జంక్షన్ మీదుగా బల్దియా ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
స్వయం సహాయక మహిళా సంఘాలు, ట్రాన్స్ జెండర్లకు, వికలాంగులకు కేటాయించిన మరుగుదొడ్లు సక్రమంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. త్వరలో వారికి మరిన్ని మరుగుదొడ్లు నిర్వహణకు అందజేస్తామన్నారు. పట్టణ ప్రగతి ఆప్‌లో సానిటరీ ఇన్స్పెక్టర్లు, మరుగుదొడ్ల నిర్వహణ సమాచారం ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. చట్టంలో పేర్కొన్న విధంగా ప్రతీ మూడేండ్లకు ఒకసారి సెప్టిక్ ట్యాంక్‌ను లైసెన్సుడ్ ఆపరేటర్ల ద్వారా మాత్రమే శుభ్రం చేయించుకోవాలన్నారు. ప్రజలకు ఇట్టి విషయం పై చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 14420నంబర్‌ను సంప్రదించి సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ సేవలు పొందవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమంగా సేవలు అందిస్తున్న సెప్టిక్ ట్యాంక్ నిర్వాహకులు, కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్వహిస్తున్న ట్రాన్స్ జెండర్స్, మహిళ సంఘాలకు, దిస్లజ్ ఆపరేటర్లు, పారిశుధ్య సిబ్బందికి కమీషనర్ ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఇంచార్జ్ అదనపు కమీషనర్ విజయలక్ష్మి, సి.ఎం.హెచ్.ఓ. డా.రాజారెడ్డి,డి. ఎఫ్.ఓ.కిషోర్, డిప్యూటీ కమీషనర్ లు జోనా, రవీందర్ యాదవ్, పన్నుల అధికారి శాంతి కుమార్,ఇంజనీరింగ్ అధికారులు, ఆస్కి ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.