Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలతోపాటు పార్లమెంటులో గతంలో ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెల్లి కృష్ణ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో రైతు చట్టాలను ప్రవేశపెట్టిన సమయంలోనే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఇది దేశంలోనే కోట్లాదిమంది కార్మికులను కార్పొరేట్ సంస్థలకు, యజమానులకు కట్టు బానిసలుగా మార్చి వేయడమేనని తెలిపారు. మండల కేంద్రంలోని గడ్డం వెంకట్రామయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ టైల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ అనుబంధం) అధ్యక్షుడు సీతారామయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సుమారు 700 మంది రైతుల ప్రాణాలను బలి తీసుకున్న తర్వాత మోడీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు వంతపాడే చర్యలను మానుకొని రైతులకు, ప్రజలకు మేలు చేసే విధానాలను అమలు చేయాలని హితవు పలికారు. లేనిపక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పంటలకు మద్దతు ధర కల్పించాలని స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసుల మేరకు గిట్టుబాటు ధరలను ఇవ్వాలని, విద్యుత్తు సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పోరాట స్ఫూర్తిని కార్మిక సంఘాలు ఆదర్శంగా స్వీకరించాలని, రాజీలేని పోరాటాలు నిర్వహించాలని కోరారు. సమావేశంలో తెలంగాణ టైల్ వర్కర్స్ యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాంసింగ్, ప్రధాన కార్యదర్శి మదార్, కార్యదర్శి ఏపూరి వీరభద్రం, నాయకులు లింగయ్య తదితరులు పాల్గొన్నారు.