Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లెనినా
నవతెలంగాణ-బయ్యారం
తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు బాలికలకు అండగా ఉంటామని జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లెనినా అన్నారు. ఆదివారం మండలంలోని కొత్తపేట గ్రామపంచాయతీ సింగారం-2 కాలనీకి చెందిన అన్నపర్తి ఉపేందర్, తిరుపతమ్మ దంపతులు ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో మృతిచెందగా మృతుల కుమార్తెలు శ్యామల, బిందును పరామర్శించారు. తక్షణ సహాయం కింద 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఇద్దరి పిల్లలని ప్రభుత్వమే చదివిపిస్తుందని, వారికి కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి నెలా రూ.2వేలు ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వారి బాగోగులను పెదనాన్న చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారికి ఎటువంటి సమస్య తలెత్తినా చైల్డ్ హెల్ప్ లైన్ 1098కు కాల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సుగుణ, బాలల సంరక్షణ అధికారి బొలగాని నరేష్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ వెంకటేష్, ఉమరాణి, సామాజిక కార్యకర్త వెంకన్న తదితరులు పాల్గొన్నారు.