Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ హరిత హరానికి ఆరు నెలలే గడువు
అ మట్టి సేకరణ, బ్యాగ్ ఫిల్లింగ్
పూర్తి కాని వైనం !
నవతెలంగాణ-మల్హర్రావు
పల్లెప్రగతిలో భాగంగా ఏర్పాటు చేస్తున్న హరిత హారం నర్సరీల పనులు మండలంలో నత్తనడకన సాగుతున్నాయి. అంచనాలు తయారు చేసిన అధికార యంత్రాంగం పనుల పురోగతిపై నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ఇటీవల భూపాలపల్లి జిల్లా ఆదనపు కలెక్టర్ దివాకర మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మల్హర్రావు అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఉపాధి అధికారులపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేయడమే ఇందుకు నిదర్శనం. నర్సరీల ఏర్పాటులో వేగం పెంచాలని ,ఈ నెల 20లోపు అన్ని గ్రామాల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అయినా మండలంలో నర్సరీల ఏర్పాటులో ఇంకా మట్టి తరలింపు, బ్యాగ్ ఫిల్లింగ్ పనులు పూర్తికాలేదు. ప్రభుత్వం విధించిన గడువు లోపు లక్ష్యం నెరెవేరేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మండలవ్యాప్తంగా 15 గ్రామపంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేసేందుకు అంచనాలు సిద్ధం చేశారు. ఉపాధిహామీ ఆధ్వర్యంలో మొత్తం 1.83 లక్షల మొక్కలు పెంచేందుకు లక్ష్యంగా నర్సరీలు ఏర్పాటు చేస్తున్నారు. చిన్నతూండ్ల, దుబ్బపేట, మల్లంపల్లి, అడ్వాలపల్లి గ్రామాల్లో ఒక్కో గ్రామానికి 10 వేల చొప్పున మొత్తం 40వేల మొక్కలు, తాడిచెర్ల, మల్లారం, పెద్దతూండ్ల, కోయ్యుర్, కొండంపేట, ఇప్పలపల్లి, వల్లేంకుంట, రుద్రారం, ఎడ్లపల్లి, నాచారం, ఆన్ సాన్ పల్లి గ్రామాల్లో ఒక్కో గ్రామానికి 13 వేల చొప్పున మొత్తం 1.43 లక్షల మొక్కలు పెంచేందుకు సిద్ధం చేస్తున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో మల్లారంలో 75 వేలు, రుద్రారంలో 50వేలు మొత్తం 1.25 లక్షల మొక్కలు పెంచేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో 50 శాతం నర్సరీల్లో కూడా పూర్తి స్థాయిలో మొక్కల పెంపకం జరగని పరిస్థితి. పనులు ఆలస్యంగా ప్రారంభించడంతో నర్సరీలలో నిర్ణిత సైజులో పెరగాల్సిన మొక్కలు పెరగకపోవడం, హరితహారంలో చిన్న సైజు మొక్కలు నాటడంతో అవి బతకడం లేదు. ఏటా పనుల్లో పురోగతి లేక మొక్కల పెంపకం ముందుకు సాగని పరిస్థితి. మట్టి సేకరణ,బ్యాగ్ ఫిల్లింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఎర్ర మట్టి దొరకట్లేదనే సాకు చూబులూ కాలయాపన చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.