Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ విద్యార్థినులకు తప్పని ఇక్కట్లు
నవతెలంగాణ-మల్హర్రావు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణకు అందించే ఆరోగ్య కిట్ల జాడే లేకుండా పోయింది. కరోనా అనంతరం పాఠశాలలు పునర్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఇంతవరకు బాలికలకు ఆరోగ్య సంరక్షణ కిట్లు పంపిణీ చేయలేదు. దీంతో కిశోర బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్య కిట్టు ఇస్తారా... ఇవ్వరా అనే సమాచారం లేకుండా పోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తూ ప్రయివేటు పాఠశాలలకు దీటుగా తీర్చి దిద్దుతామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
మండలంలో మొత్తం 5 జిల్లా పరిషత్, ఒక మోడల్ పాఠశాల, ఒక కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 6 నుంచి 10వ తరగతి వరకు చదివే బాలికలు 533మంది ఉన్నారు. వీరికి 2017-18నుంచి ఏడాదిలో మూడుసార్లు ఆరోగ్య సంరక్షణ కిట్లు పంపిణీ చేస్తోంది. కరోనా నేపథ్యంలో 2020 మార్చి 23 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు మూతబడిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా బాలికలకు ఆరోగ్య సంరక్షణ కిట్లు అందించలేదు. ఒక్కో కిట్ విలువ సుమారు రూ.వెయ్యి ఉంటుంది. ఇప్పటి వరకు కిట్ల విషయంలో తమకు ఎలాంటి సమాచారం లేదని విద్యాశాఖ అధికారులే పేర్కొనడం గమనార్హం.