Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి
నవతెలంగాణ-మరిపెడ
పట్టపగలు వేర్వేరు చోట్ల దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని బక్కరూప్లా తండాకు చెందిన భూక్య కళ్యాణ్ కుటుంబసభ్యులు వ్యవసాయం పనులకు వెళ్లగా అదే తండాకు చెందిన అజ్మీరా చంద్రు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని రూ.4.66 లక్షలు అపహరించాడు. అయితే వ్యాపారంలో నష్టపోవటం, జల్సాలు అధికమై అప్పులు ఎక్కువ కావడంతో దొంతనం చేసి అప్పులు తీర్చాలనుకున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం డబ్బులు తీసుకొని వెళ్లేందుకు ఇంటికి రాగా అప్పటికే రెక్కీ వేసిన పోలీసులు చంద్రును చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అలాగే గూడూరు మండలం బొడ్డుగొండ శివారు భారత్ ఫిల్లింగ్ స్టేషన్లో సిబ్బందిని ఏమార్చి రూ.3.80 లక్షలు తీసుకొని పరారైన నిందితున్ని గూడూరు పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా రూరల్ మండల కాచిరాజుగుడెం గ్రామానికి చెందిన ఇమ్మడి వెంకటేశ్వర్లు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి ఖమ్మం జిల్లాలో దొంగతనాలు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే నవంబర్ 25న గూడూరు మండలంలోని బొద్దుగొండ శివారు భారత్ ఫిల్లింగ్ స్టేషన్కు కారులో వచ్చి బంకు సిబ్బందిని తనకు వరికోత మిషన్లు ఉన్నాయని నమ్మించాడు. కాసేపు సెల్ ఛార్జింగ్ పెడుతున్నట్లు నటించి రూ.2.50 లక్షలు తీసుకొని ఉడాయించాడు. అలాగే ఖమ్మం జిల్లాలోని మరో రెండు పెట్రోల్ బంకుల్లో రూ.1.20 లక్షలు చోరీ చేశాడు. బుధవారం మళ్లీ గూడూరు మండలంలోని ఓ ఫిల్లింగ్ స్టేషన్లో ఇదే రీతిలో మాట్లాడుతుండగా పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇద్దరు దొంగలను చాకచక్యంగా పట్టుకున్న మరిపెడ సీఐ సాగర్ నాయక్, ఎస్సై ప్రవీణ్, గూడూరు సీఐ రాజిరెడ్డి, ఎస్సై సతీష్లను ఎస్పీ కోటిరెడ్డి అభినందించి రివార్డులు అందించారు.