Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాలుగేండ్లు గడిచినా పూర్తికాని పనులు
కాంట్రాక్టర్ తీరుపై గ్రామస్తుల అసహనం
ఉకల్లో కలగానే మిగులుతున్న
జీపీ భవనం..
నవతెలంగాణ-రాయపర్తి
రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ నిధులను మంజూరు చేస్తోంది. అయితే కాంట్రాక్టర్ల అవతారమెత్తిన చోట లీడర్లు లాభసాటి వ్యాపారం కోసం నిధులు ఉన్నప్పటికీ నిర్మాణ పనులు చేయకుండా కాలం వెల్లదీస్తున్నారు. భారత జాతిపిత మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం మాటలకే పరిమితం అవుతోంది. గ్రామ పాలనలో కీలక పాత్ర పోషించే గ్రామ పంచాయతీ పక్కా భవనం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన కాంట్రాక్టర్ శైలితో మధ్యలోనే నూతన గ్రామ పంచాయతీ భవనం నిలిచిపోయింది.
మండలంలోని ఉకల్లో గతంలో నిర్మించిన పంచాయతీ భవంతి శిథిలావస్థకు చేరడంతో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నూతన జీపీ భవనం కోసం నిధులు మంజూరు చేశారు. ఈ క్రమంలో ఆగస్టు 31, 2018న ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద 16లక్షల అంచనా వ్యయంతో ఆయన జీపీ భనన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పంచాయతీ భవన నిర్మాణ కార్యక్రమ అంగరంగ వైభవంగా జరగడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ గ్రామస్తుల ఆనందం కాంట్రాక్టర్ వ్యవహారంతో కొంత కాలానికి ఆవిరిలా మారిపోయింది. పంచాయతీ పాలనకు నెలవైన గ్రామ సచివాలయం అరకొరగా ఉండడంతో గ్రామస్తులతో పాటు గ్రామ సిబ్బంది, పాలకమండలి సైతం అగచాట్లకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధుల కొరతతో నిలిచిపోయిన పనులు అనేక చోట్ల ఆగుతాయి. కానీ ఇక్కడ మాత్రం నిధులు ఉన్నప్పటికీ నిర్మాణం పనులు నత్తనడకన జరగడం విడ్డూరంగా ఉందని స్థానికులు కాంట్రాక్టర్ పై దుయ్యబడుతున్నారు.
పాత గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరింది. పైకప్పుకు చిల్లులు పడడంతో వర్షం కురిస్తే కార్యాలయంలోని కంప్యూటర్, ఉపాధి హామీ ఫైల్స్, ఫాగింగ్ మిషన్, బ్లీచింగ్ పౌడర్ బస్తాలు, ఇతర విలువైన వస్తువులు తడిసిపోతున్నాయి. దీంతో అనేక ఇక్కట్లు పడాల్సి వస్తోందని పాలక మండలి తెలుపుతోంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి గ్రామాల అభివద్ధి కోసం లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తుంటే పని దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తున్నా నిర్మాణాన్ని పూర్తి చేయడం లేదని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.