Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సింహులపేట
ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన నిర్వాహకులకు బిల్లులు అందడం లేదు. అప్పు చేసి విద్యార్థులకు నిర్వాహకులు భోజన ఏర్పాట్లు చేయాల్సిన దుస్థితి నెలకొంది. మండలంలో 34 ప్రాథమిక, 10 ప్రాథమికోన్నత, రెండు ఉన్నత పాఠశాలలు ఉండగా దాదాపుగా మూడు వేల మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు దాదాపు 60 మందికిపైగా మధ్యాహ్న భోజన నిర్వాహకులు పని చేస్తున్నారు. ఒక్కొక్కరికి ప్రభుత్వం నెలకు వెయ్యి రూపాయలు చొప్పున చెల్లించడానికి నిర్ణయించింది. భోజన బిల్లులను తరగతుల వారీగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విడుదల చేస్తోంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టాక స్కూల్లు ప్రారంభమై మూడు నెలలు గడిచినా బిల్లులు చెల్లించలేదు.
బిల్లుల చెల్లింపుల ఇలా..
ఒకటి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థికి రూ.4.97లు, ఆరు నుంచి 8వ తరగతి వరకు రూ.7.45లు, 9 నుంచి పదో తరగతి వరకు రూ.9.45లు చొప్పున చెల్లిస్తుంది. అలాగే ఒకటి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు వారానికి మూడు కోడిగుడ్లు అందించేలా ఒక్కో గుడ్డుపై ప్రభుత్వం రూ.4లు చెల్లిస్తోంది.
నిర్వాహకులపై రూ.50 వేల వరకు భారం
ప్రభుత్వం పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలు గడచినా మధ్యాహ్న భోజన నిర్వాహకులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ప్రభుత్వం కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేస్తోంది. మిగతా నిత్యావసర సరుకులు కిరాణా దుకాణం నుంచి అప్పు చేసి తీసుకొస్తున్నారు. సుమారు 100 మంది విద్యార్థులున్న స్కూల్లో రోజుకు దాదాపు 750 నుంచి వెయ్యి రూపాయల వరకు మధ్యాహ్న భోజన నిర్వాహకులపై భారం పడుతోంది. ఈ లెక్కన నెలకు కనీసం రూ.20-25 వేలు పడుతోంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇప్పటివరకు ఒక్కో నిర్వాహకురాలిపై రూ.50 వేలకుపైగా భారం పడింది.
భగ్గుమంటున్న ధరలు
మధ్యాహ్న భోజనంలో బియ్యం తప్ప కూరగాయలు, మంచినూనె, కందిపప్పు, గ్యాస్, కట్టెలు, ఇతరత్రా సామాన్లను మధ్యాహ్న భోజన నిర్వాహకులు కొనుగోలు చేసి వంట చేయాల్సి రావడంతో ప్రభుత్వం చెల్లిస్తున్న డబ్బులు సరిపోవడం లేదు. కేజీ టమాట రూ.100లు కాగా మిగతా కూరగాయలు కేజీ రూ.80లు పలుకుతున్నాయి. ఇక గ్యాస్ సిలిండర్ కొనలేని పరిస్థితి ఉంది. కట్టెల పొయ్యి పెడదామంటే కట్టెల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయని మధ్యాహ్న భోజన నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వం ఒక గుడ్డు కోసం రూ.4లు అందిస్తుండగా నిర్వాహకులు రూ.5.50లు చొప్పున చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇప్పటికైనా మధ్యాహ్న భోజన బిల్లులు వెంటనే చెల్లించాలని నిర్వాహకులు కోరుతున్నారు.
గిట్టుబాటు కావడం లేదు : సిలువేరు యాకమ్మ, నిర్వాహకురాలు, హైస్కూల్
కూరగాయలు, నూనెలు, ఇతర నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగిన ప్రభుత్వం ఇచ్చే బిల్లులు పెంచలేదు. ఒక్కొక్కరికి రూ.5-6లు ధర పలుకుతోంది ప్రభుత్వం ఇచ్చేది నాలుగు రూపాయలు మాత్రమే. పెరిగిన ధరలతో పిల్లలకు భోజనం పెట్టడం కష్టంగా ఉంది. ప్రభుత్వం బిల్లులు కూడా ఎప్పటికప్పుడు చెల్లించడం లేదు.
బకాయిలు చెల్లించాలి : దురు ఉపేంద్ర, నిర్వాహకురాలు, హైస్కూల్
ఇప్పటికే మూడు నెలల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం నుంచి కేవలం బియ్యం మాత్రమే అందుతున్నాయి. గ్యాస్ పొయ్యిలు లేకపోవడంతో కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నాము. పొగకు ఇబ్బందులు తప్పడం లేదు.
కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం : గుగులోతు రాము, ఎంఈఓ
వంట నిర్వాహకులకు రావలసిన బిల్లులుపై నివేదిక తీసుకున్నాం. వాటిని ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లాం. మళ్లీ అధికారులతో మాట్లాడి బిల్లులు అందేలా చూస్తాం. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు వంట చేస్తున్నందుకు నిత్యావసర సరుకులు, ఇస్తున్న చెల్లింపుల పెంపు విషయాన్ని ప్రభుత్వ, ఉన్నతాధికారులకు వివరిస్తాము.